పన్ను చెల్లింపుదారులకు వేధింపులుండవు

8 Jan, 2020 10:11 IST|Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

అఖిల భారత వర్తక సమాఖ్య సమావేశంలో ప్రసంగం

న్యూఢిల్లీ: పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్‌ పాల్గొని మాట్లాడారు. జీఎస్‌టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా పన్నుల వ్యవస్థను సులభంగా మార్చే చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వేధింపుల్లేకుండా చేసేందుకు గాను ఈ అస్సెస్‌మెంట్‌ పథకాన్ని గతేడాది అక్టోబర్‌లో ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు, పన్నుల అధికారి మధ్య అనుసంధానత అవసరపడదన్నారు.

గతేడాది అక్టోబర్‌ ఒకటి నుంచి ఆదాయపన్ను శాఖ కంప్యూటర్‌ జారీ చేసే డాక్యుమెంట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (డీఐఎన్‌) వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన విషయం గమనార్హం. ఆదాయపన్ను శాఖ నుంచి అన్ని రకాల సమాచార, ప్రత్యుత్తరాలకు.. అస్సెస్‌మెంట్, అప్పీళ్లు, విచారణ, పెనాల్టీ, దిద్దుబాటు వంటి వాటికి డీఐఎన్‌ అమలవుతుంది. తద్వారా పన్ను అధికారుల నుంచి నకిలీ నోటీసుల బెడద ఉండదు. ప్రతీ సమాచారానికి గుర్తింపు నంబర్‌ ఉంటుంది. ఈ తరహా కేసులను 30 రోజుల్లోగా ముగించాల్సి ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. దేశవ్యాప్తంగా షాపింగ్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తామని మంత్రి మరోసారి తెలిపారు. దుబాయిలో నిర్వహించినట్టుగానే భారీ షాపింగ్‌ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపడతామని మంత్రి గతేడాది ప్రకటించారు. ఇవి మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. వాణిజ్య శాఖ దీనిపైనే పనిచేస్తోందని, వర్తకులు తమ సరుకులను విక్రయించుకునేందుకు పెద్ద వేదికను అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు