యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం

27 Mar, 2020 05:42 IST|Sakshi
నిర్మలా సీతారామన్‌

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సమస్యలు ఉన్నప్పటికీ .. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ యథాప్రకారంగానే కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి విలీనాలు అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా బ్యాంకుల విలీనానికి డెడ్‌లైన్‌ పొడిగించే అవకాశముందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ .. ‘ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు‘ అని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో డెడ్‌లైన్‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలంటూ అఖిల భారత బ్యాంక్‌ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్‌–19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో బ్యాంకింగ్‌ సేవలపైనా ప్రతికూల ప్రభావం ఉంటోంది.

10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు భారీ బ్యాంకర్లుగా విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. విలీన ప్రక్రియ పూర్తయితే ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న బ్యాంకులు ఉంటాయి. ప్రణాళిక ప్రకారం.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనమవుతున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్‌ బ్యాంకును, ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకును, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌.. కార్పొరేషన్‌ బ్యాంకును విలీనం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు