10 వేల ఉద్యోగాలకు ముప్పు

24 Jul, 2019 12:08 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను తగ్గించుకోనున్న నిస్సాన్‌

10 వేల మందికి ఉద్వాసన పలికే యోచనలోకంపెనీ

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ  నిస్సాన్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది.  ఆర్థిక సంక్షోభం,  ఖర్చులను తగ్గించుకునే క్రమంలో​ గ్లోబల్‌గా 4వేల 800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించిన కంపెనీ తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసిందట. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా బుధవారం అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. 

అమెరికా, ఐరోపాలో అమ్మకాలు పడిపోవడంతో ఈ సంస్థ దెబ్బతినడంతోపాటు, ఆర్థిక కుంభకోణం ఆరోపణలపై మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్‌ అరెస్ట్‌ తరువాత నిస్సాన్‌ మరింత కుదేలైంది. అలాగే 43 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్‌తో వివాదం ముదిరి సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఉద్యోగుల్లో లక్షా 39వేల ఉద్యోగాల్లో 4,800 ఉద్యోగాల కోత పెట్టనున్నామని  కంపెనీ మేలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  తాజా కథనాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్‌ ప్రతినిధి నిరాకరించారు. 

కాగా నిస్సాన్‌ లాభాలు గత ఏడాది దశాబ్దం కనిష్టానికి పడిపోయింది. అలాగే భవిష​త్తు మరింత కష్టంగా  ఉండనుందని కూడా వ్యాఖ్యానించింది. 2019 మార్చి లో 319 బిలియన్ యెన్ల (2.9 బిలియన్ డాలర్లు) నికర లాభాలను నివేదించింది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 57 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాలు 170 బిలియన్లకు పడిపోవచ‍్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది.
 

>
మరిన్ని వార్తలు