ఎస్యూవీలతో నిస్సాన్ పరుగులు

9 Jun, 2016 13:14 IST|Sakshi
ఎస్యూవీలతో నిస్సాన్ పరుగులు

ముంబై : భారత్ రోడ్లపై మరిన్ని ఎస్ యూవీలను పరుగులు పెట్టించాలని జపాన్ ప్రముఖ కార్ల తయారీదారి నిస్సాన్ భావిస్తోంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్ యూవీ)లపై, క్రాస్ ఓవర్స్ పై ఎక్కువగా దృష్టి సారించి, వచ్చే నాలుగేళ్లలో 5శాతం మార్కెట్ షేరును చేజిక్కించుకోవాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంచనాల తగ్గట్టూ తన మార్కెట్ షేరు లేకపోవడంతో, తన ఫర్ ఫార్మెన్స్ ను పెంచుకోవాలని నిర్ణయించింది. గత మంగళవారమే డాట్సన్ నుంచి క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ రెడీ-గో ను ప్రవేశపెట్టిన నిస్సాన్, వచ్చే మూడేళ్లలో మరో మూడు కొత్త కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. అన్ని విభాగాల్లో తన హవా చాటాలని నిస్సాన్ చూస్తోందని కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులు చెప్పారు.


ఈ ఏడాది చివరి నాటికి దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టబోయే సరికొత్త ఎక్స్ ట్రయల్ ప్రీమియం ఎండ్ వాహనానికి రెడీ-గోను ఎంట్రీ లెవల్ గా నిస్సాన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో కొత్త కార్ డాట్సన్ గో క్రాస్, కోడ్ నేమ్డ్ ఈఎమ్2 ను 2019లో భారత రోడ్లపై పరుగు పెట్టించాలని నిస్సాన్ భావిస్తోంది. ఈ కారు ధరను ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మారుతీ సుజుకీ విటారా బ్రిజా ధరకు సమానంగా రూ.5 లక్షల నుంచి రూ. 10లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. మరో ఎస్ యూవీ వెహికిల్ పీబీ1డీను హ్యుందాయ్ క్రిటాకు సమానంగా రూ.8లక్షల నుంచి రూ.15లక్షల మధ్యలో భారత్ లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఎస్ యూవీ వెహికిల్స్ పై నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ ఎక్కువగా దృష్టిపెట్టనుందని భారత కార్యకలాపాల అధ్యక్షుడు గిలామ్ సికార్డ్ కూడా వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు