మెగా డీల్‌: నీతి ఆయోగ్‌ ఓకే..ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్రు

10 May, 2018 20:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌డీల్‌పై  నీతి ఆయోగ్‌ సానుకూలంగా స్పందించింది. 16 బిలియన్ డాలర్ల (రూ 1.05 లక్షల కోట్లు) ఈ  ఒప్పందం భారత విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని  నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్  వ్యాఖ్యానించారు.  ఈ ఒప్పందం దేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ప్రకారం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ఇ-కామర్స్ ఒప్పందం ఇది చాలా సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుందన్నారు.  గ్లోబల్‌ లీడర్‌  వాల్‌మార్ట్‌ ఎంట్రీతో  చౌక ధరలతో  భారతదేశంలో చిన్న వ్యాపారాలకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు  ఈ కామర్స్‌ మార్కెట్‌లో మెగాడీల్‌గా అభివర్ణిస్తున్న ఈ కొనుగోలుపై  ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్  ప్రతికూలంగా స్పందించింది.   వాల్‌మార్ట్‌ "బ్యాక్ డోర్ ఎంట్రీ" కోసం  ఎఫ్‌డీఐ నియమాలను ఉల్లఘించిందని ఆరోపించారు.జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు   సంస్థ కో కన్వీనర్‌ అశ్వనీ మహాజన్ ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు దెబ్బతింటాయని,  చిన్న దుకాణాలను,  ఉద్యోగాల కల్పిన అవకాశాన్ని బాగా  దెబ్బతీస్తుందంటూ స్వదేశీ జాగరణ మంచ్ ఆందోళన చేపట్టింది. వాల్‌మార్ట్‌ గో బ్యాక్‌ అంటూ ప్రదర్శన నిర్వహించింది.  వ్యాపారవేత్తలు ఇప్పటికే తమ ఉనికి కోసం పోరాడుతున్నారు, దేశీయ  వ్యాపారంలో వాల్‌మార్ట్‌ ప్రవేశం వారికి మరింత సమస్యలను సృష్టిస్తుందన్నారు. కాగా ఈ డీల్‌తో భారతదేశానికి చాలా మేలు చేస్తుందని వాల్‌మార్ట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిల్లన్  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు