ప్రజలందరికీ ఇళ్లు, కార్లు, ఏసీలు

24 Apr, 2017 17:01 IST|Sakshi
ప్రజలందరికీ ఇళ్లు, కార్లు, ఏసీలు
న్యూఢిల్లీ : అందరికీ అందుబాటులో గృహాలు అనే ధృడసంకల్పంతో ముందుకెళ్తున్న కేంద్రప్రభుత్వం, భారత్ కు కొత్త రూపు తీసుకురావాలని యోచిస్తోంది. వచ్చే 15 ఏళ్లలో ప్రజలందరికీ గృహాలు, టూ-వీలర్స్ లేదా కార్లు, పవర్, ఎయిర్ కండీషనర్లు, డిజిటల్ కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ వేస్తోంది. ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఓ విజన్ ను రూపొందించింది. 2031-32 పేరుతో తీసుకొచ్చిన ఈ విజన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా గవర్నింగ్ కౌన్సిల్ ముందు ఉంచారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం జరిగిన భేటీలో అరవింద్ పనగారియా దీన్ని ప్రజెంట్ చేశారు. 
 
పూర్తిస్థాయి అక్షరాస్యత గల సమాజాన్ని ఏర్పాటుచేసి, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని ప్రజలకు అందించాలని నీతి ఆయోగ్ ఈ విజన్ ను రూపొందించింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో నాణ్యతమైన గాలి, నీటి సదుపాయాలను అందుబాటులో ఉంచేలా.. రోడ్డులు, రైల్వేలు, వాటర్ వేస్, ఎయిర్ కనెక్టివిటీ, క్లీన్ ఇండియా విస్తరింపజేయాలని నీతి ఆయోగ్ విజన్ పేర్కొంది. 2031-32 వరకు ఒక్కొక్కరి తలసరి ఆదాయం కూడా మూడింతలు పెంచి 3.14 లక్షలకు చేర్చాలని ప్రతిపాదించింది. అంతేకాక, స్థూల దేశీయోత్పత్తి లేదా ఎకానమీ 2031-32 లోపల 469 లక్షల కోట్లకు పెంచాలన్నది  లక్ష్యంగా నీతి ఆయోగ్ నిర్దేశించింది. కేంద్ర, రాష్ట్రాల వ్యయాలను 92 లక్షల కోట్లకు పెంచాలని తన విజన్ లో పేర్కొంది.  ''మనం కచ్చితంగా భారత్ ను సంపన్నవంతగా, ఆరోగ్యకరంగా, సురక్షితంగా, అవినీతి రహితంగా, శక్తి సామర్థ్య దేశంగా,  ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలి దేశంగా, క్లీన్ ఎన్విరాన్మెంటల్ గా తీర్చిదిద్దాల్సి ఉందని'' ఈ విజన్ లో నీతి ఆయోగ్ తెలిపింది. 
మరిన్ని వార్తలు