జీఎస్‌టీ ప్యానెల్‌లో మహిళలేరి?

28 Nov, 2017 00:18 IST|Sakshi

మగవాళ్లున్నారు కనకే షేవింగ్‌ కిట్లపై పన్ను లేదు

ఆడవారి శానిటరీ నాప్‌కిన్స్‌పై మాత్రం జీఎస్‌టీ

ఇంటెల్‌ ఇండియా హెడ్‌ నివృతి రాయ్‌ వ్యాఖ్యలు

జీఈఎస్‌ సన్నాహక కార్యక్రమంలో మహిళల ఆగ్రహం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అనేది దేశీయ పన్ను సంస్కరణలల్లో అత్యంత కీలక మలుపుగా పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం... 31 మంది పాలసీ సభ్యుల్లో కనీసం ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని ఇంటెల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ నివృతి రాయ్‌ వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ పాలసీ ఎంపిక, వస్తువుల జాబితా, రేట్ల ఖరారు వంటి కీలకాంశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ‘‘అందుకే! మహిళలు వాడే శానిటరీ న్యాప్‌కిన్స్‌కు 12% జీఎస్‌టీ శ్లాబును నిర్ణయించి.. పురుషుల షేవింగ్‌ కిట్స్‌కు మినహాయింపు ఇచ్చారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూఎస్‌–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) ఆధ్వర్యంలో ‘ది ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్స్‌’ అనే అంశంపై సోమవారమిక్కడ చర్చాగోష్టి జరిగింది. ఇందులో కలారీ క్యాపిటల్‌ ఎండీ వాణి కోలా, ఇంటెల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ నివృతి రాయ్, ఐబీఎం ఇండియా చైర్‌పర్సన్‌ వనితా నారాయణన్‌ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా నివృతి రాయ్‌ మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో రాత్రి 8 తర్వాత మహిళలు ఉద్యోగం చేయలేని పరిస్థితి దాపురించింది. స్త్రీకి రక్షణ, భద్రత కరువయ్యాయి. ఎవరి గురించో ఎందుకు!! నన్నే తీసుకోండి. రాత్రి ఆఫీసులో మీటింగ్‌ లేదా వర్క్‌ ఉంటే... నాతో పాటు మా ఆయన కూడా ఉదయం మూడు నాలుగింటి వరకూ ఆఫీసు లాబీలో ఎదురు చూస్తుంటారు’’ అని వివరించారు. మహిళలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వాలు నడుం బిగించాలని సూచించారు. జీడీపీ వృద్ధిలో మహిళ ప్రాధాన్యత అత్యంత దయనీయంగా ఉందంటూ... ఆవిష్కరణ, ఎంట్రప్రెన్యూర్‌షిప్, పాలసీ.. ఈ మూడే జాతి స్థితిగతుల్ని మారుస్తాయన్నారు. ప్రస్తుతం దేశీ ఐటీ రంగంలో మహిళా ఉద్యోగుల వాటా 30% వరకూ ఉందని.. అన్ని రంగాల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని సూచించారు.

విద్యా రంగంలో మహిళల పాత్ర నిల్‌..
దేశీయ విద్యా రంగంలో మహిళలకు చోటు లేదని ఐబీఎం ఇండియా చైర్‌పర్సన్‌ వనితా నారాయణన్‌ వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ఒక్క ఇంజనీరింగ్‌ కళాశాల బోర్డులోనూ మహిళా డైరెక్టర్లు లేరన్నారు. అందుకే మహిళలకు విద్యలో ప్రాధాన్యం తగ్గుతోందని.. ఈ రంగంలోనూ మహిళలకు చోటు కల్పించాలని సూచించారు. కలారీ క్యాపిటల్‌ ఎండీ వాణి కోలా మాట్లాడుతూ.. ఎంచుకున్న రంగంలో లక్ష్యం నిర్దేశించుకొని చేరుకునే దిశగా ఆలోచనలు చేయాలని.. మధ్యలో ఎదురొచ్చే సవాళ్లు, సమస్యలను పట్టించుకోకూడదని పిలుపునిచ్చారు.

 ‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి.. సిలికాన్‌ వ్యాలీకి వెళ్లాను.  2006లో తిరిగి ఇండియాకి వచ్చా. 2012లో 150 మిలియన్‌ డాలర్ల నిధులతో కలారీ క్యాపిటల్‌ను ప్రారంభించా. సాంకేతికత, ఆవిష్కరణకు పెద్ద పీట వేసే స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెడుతుంటాం. ఇప్పటివరకు స్నాప్‌డీల్, మింత్ర, అర్బన్‌ ల్యాడర్, జివామీ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం’’ అని తెలిపారు. కార్యక్రమంలో గర్ల్‌ రైజింగ్‌ ప్రొడ్యూసర్‌ అమితా వ్యాస్, యూఎస్‌ఐబీసీ ప్రెసిడెంట్‌ నిషా బిస్వాల్‌ పాల్గొన్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా