బంగారం అమ్మకాలపై మరో ప్రకటన

13 Jul, 2017 20:26 IST|Sakshi
బంగారం అమ్మకాలపై మరో ప్రకటన
న్యూఢిల్లీ: బంగారంపై 3 శాతం జీఎస్టీ విధించడంపై జువెల్లరీ రంగం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధింపుతో అక్రమ బంగారం విక్రయాలు వెల్లువెత్తాయని వాదనలు వినిపిస్తున్నాయి.. మరోవైపు నుంచి ఏ బంగారంపై జీఎస్టీ వర్తిస్తుంది? ఏ బంగారంపై వర్తించదో తెలుపుతూ ఆర్థిక మంత్రిత్వశాఖ రోజుకో ప్రకటన ఇస్తూ వస్తోంది. నిన్ననే పాత జువెల్లరీని అమ్మితే 3 శాతం జీఎస్టీ వర్తిస్తుందని చెప్పిన ప్రభుత్వం నేడు మరో ప్రకటన చేసింది. సాధారణ ప్రజలు బంగారు ఆభరణాలను రిజిస్ట్రర్‌ జువెల్లర్లకు అమ్మితే మాత్రం ఎలాంటి జీఎస్టీ ఉండదని స్పష్టంచేసింది. 
 
రిజిస్ట్రర్‌ జువెల్లర్లకు సాధారణ ప్రజలు బంగారం ఆభరణాలు అమ్మితే 3 శాతం జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. 2017 సీజీఎస్టీ యాక్ట్‌ సెక్షన్‌ 9(4) ప్రొవిజన్ల కింద పాత ఆభరణాలను ప్రజలు, జువెలర్లకు అమ్మిన పక్షంలో ఈ పన్ను వర్తింపు ఉండదని చెప్పింది. అలాంటి కొనుగోళ్లపై రివర్స్‌ ఛార్జ్‌ మెకానిజం కింద జువెల్లర్లు ఎలాంటి పన్ను చెల్లింపులకు బాధ్యత వహించాల్సినవసరం లేదని కూడా పేర్కొంది. అదే ఒకవేళ అన్‌రిజిస్ట్రర్‌ సప్లయర్‌ బంగార ఆభరణాలను రిజిస్ట్రర్‌ సప్లయర్‌కి అమ్మితే మాత్రం ఆర్‌సీఎం కింద పన్ను వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది.    
>
మరిన్ని వార్తలు