ఐటీ రిటర్న్‌ దాఖలు ఆలస్యమైతే...

19 Aug, 2019 08:42 IST|Sakshi

నష్టాలకు క్యారీ ఫార్వార్డ్‌ ఉండదు

ఇంటిపై నష్టాలకు మాత్రం మినహాయింపు

జరిమానా చెల్లించుకోవాల్సి రావచ్చు

ఆలస్యమైన కాలానికి పన్ను మొత్తంపై వడ్డీ

గడువులోపు దాఖలుతో ఎన్నో ప్రయోజనాలు

తప్పులుంటే సవరణ రిటర్నులు

ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు విషయంలో అశ్రద్ధ వహించి గడువులోపు ఆ పనిచేయకపోతే కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఈ లోపు దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్  234 ఎఫ్‌ 2017 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్  కింద ఐటీఆర్‌ ఆలస్యంగా దాఖలు చేసిన వారికి రూ.10,000 వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు రిటర్నులు దాఖలు చేశారన్న దానిపై ఈ పెనాల్టీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇక ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు చేస్తే చెల్లించాల్సిన పన్ను మొత్తంపై వడ్డీ అదనంగా చెల్లించుకోవాలి. అంతేకాదు కొన్ని రకాల ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సకాలంలో రిటర్నులు దాఖలు చేయడమే సరైనది.

సెక్షన్  139
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఆలస్యంగా దాఖలు చేసే వివిధ రకాల రిటర్నుల వ్యవçహారాలకు సంబంధించినది. ఓ వ్యక్తి లేదా సంస్థ నిర్దేశిత గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే ఈ సెక్ష¯Œ  తగిన మార్గదర్శకాలను తెలియజేస్తోంది. ఈ సెక్షన్ లో ఉప సెక్షన్లు కూడా ఉన్నాయి. ఇవి విడిగా భిన్న రిటర్నుల వ్యవహారాల పరిష్కారానికి సంబంధించినవి. కనుక వీటిపై ఓ సారి దృష్టి సారించాలి. 

సెక్షన్  139(1)
ఈ సెక్షన్  కింద వ్యక్తులు ఐటీఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరి. చట్టం అనుమతించిన బేసిక్‌ పరిమితికి మించి ఆదాయం ఉన్న వారు గడువు లోపు ఐటీఆర్‌ దాఖలు చేయాలి. భారత్‌కు వెలుపల ఏదైనా ఆస్తి ఉన్న వారు (ఏదైనా సంస్థతో ఆర్థిక ప్రయోజనం ముడిపడి ఉన్నా) లేదా విదేశీ ఖాతాకు సంబంధించి సంతకం చేసే అధికారం కలిగి ఉంటే అప్పుడు ఆదాయం ఎంతన్నదానితో సంబంధం లేకుండా రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేయాల్సిందే. ఇక చట్టంలోని నిబంధనల మేరకు ఐటీఆర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ ఆ పనిచేస్తే స్వచ్చంద రిటర్నులుగా పరిగణిస్తారు. ఇవి చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే రిటర్నులు. ఈ సెక్షన్  కొన్ని రకాల వ్యక్తులను పన్ను రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు కూడా ఇస్తోంది. 

సెక్షన్ 139 (3)
పన్ను చెల్లింపుదారులు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయడం వల్లే ప్రయోజనం పొందగలరు. అందుకే ఈ విషయంలో కొన్ని నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి. ‘క్యాపిటల్‌ గెయి¯Œ ్స’ (మూలధన లాభాలు), ‘ప్రాఫిట్స్‌ అండ్‌ గెయిన్ ్స ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ ప్రొఫెషన్ ’ కింద నష్టాలను ఎదుర్కొన్న వారు, వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరాల ఆదాయంలో సర్దుబాటు చేసుకోదలిస్తే తప్పనిసరిగా గడువులోపే ఐటీఆర్‌ దాఖలు చేయాలి. ఒకవేళ ఇంటిపై నష్టం ఎదురైతే మాత్రం గడువు దాటిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినా గానీ, ఆ నష్టాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు ఈ సెక్షన్  అనుమతిస్తోంది. ఇక ఇతరత్రా ఏ నష్టమైనా కానీ సకాలంలో రిటర్ను లు దాఖలు చేసినా, చేయకపోయినా వాటిని సెట్‌ ఆఫ్‌ (ఆదాయంలో సర్దుబాటు) చేసుకోవచ్చు. 

సెక్షన్  139(4)
పన్ను చెల్లింపుదారులు సెక్షన్  139(1)లో పేర్కొన్న మేరకు గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే, అసెస్‌మెంట్‌ సంవత్సరం నుంచి ఏడాదిలోపు ఆలస్యపు రిటర్నులను దాఖలు చేయవచ్చు. లేదా సెక్షన్  144 ప్రకారం మదింపు పూర్తవకముందు దాఖలు చేయవచ్చు. కాకపోతే సెక్షన్  271ఎఫ్‌లో పేర్కొన్న ప్రకారం రూ.5,000 జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. సెక్షన్ 139(1) కింద రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారు అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేసినప్పటికీ పెనాల్టీ ఉండదు.  

సెక్షన్  139(5)
గడువులోపు ఐటీఆర్‌ దాఖలు చేసిన వారు, ఆ తర్వాత అందులో ఏదైనా తప్పున్నట్టు గుర్తిస్తే, సవరణ రిటర్నులు సమర్పించే హక్కు ఉంటుంది. అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన తర్వాత ఏడాదిలోపు ఈ పని చేయవచ్చు లేదా ఐటీఆర్‌ అసెస్‌మెంట్‌ పూర్తి కాకముందు వీటిల్లో ఏది ముందు అయితే అదే అమల్లోకి వస్తుంది. ఈ గడువులోపు ఎన్ని సార్లయినా సవరణ రిటర్నులు ఫైల్‌ చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. అయితే, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల ఈ సెక్షన్  పరిధిలోకి రారు. సవరణ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉండదు. సవరణ రిటర్ను దాఖలు చేయడం ఆలస్యం సెక్షన్  139(5) కింద అదే అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. అంతకుముందు సెక్షన్  139(1) కింద దాఖలు చేసినది అమల్లో ఉండదు. అయితే, అంతకుముందు దాఖలు చేసిన రిటర్నుల్లో లోపాలు లేదా తప్పుడు ప్రకటనలన్నవి ఉద్దేశపూర్వకంగా చేయకపోతేనే సవరణ రిటర్నులు దాఖలు చేయా ల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా లోపాలు లేదా తప్పిదాలతో దాఖలు చేసినా, మోసానికి పాల్పడినా పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. 

సెక్షన్  139 (9)
లోపాలతో కూడిన ఐటీ రిటర్ను దాఖలు చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జత చేయనప్పుడు సెక్షన్  139(9) మార్గదర్శకాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని పూర్తి చేయాల్సిన కాలమ్స్‌ను వదిలి వేయడం లోపంగానే పరిగణిస్తారు. టీడీఎస్‌ మినహాయించిన సందర్భాల్లో ఆధారం జత చేయకపోయినా దాన్ని లోపంతో కూడిన రిటర్న్‌గానే చూస్తారు. పన్ను అధికారి ఇలా గుర్తించిన సందర్భంలో ఈ సమాచారం పన్ను చెల్లింపుదారునికి తెలియజేస్తారు. అప్పటి నుంచి 15 రోజుల్లోపు ఆ తప్పులను సవరించుకోవాల్సి ఉంటుంది. అయితే, దరఖాస్తు ద్వారా ఈ గడువు పొడిగించాలని కోరొచ్చు. పన్ను అధికారి ఇచ్చిన సమయంలోపు తప్పులను సవరిస్తూ రిటర్ను ఫైల్‌ చేయకపోతే, అంతకుముందు దాఖలు చేసిన రిటర్న్‌ చెల్లుబాటు కాదని గుర్తుంచుకోవాలి.  

ఆలస్యం చేయడం వల్ల ప్రతికూలతలు
గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి రావచ్చు. సెక్ష  234ఎఫ్‌ ప్రకారం సకాలంలో రిటర్నులు దాఖలు చేయడంలో విఫలం చెందితే.. రూ.10,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. సాధారణ గడువు ముగిసిన తర్వాత, అసెస్‌మెంట్‌ సంవత్సరం డిసెంబర్‌ 31 లోపు రిటర్ను దాఖలు చేస్తే రూ.5,000 జరిమానా చెల్లించాలి. అదే జనవరి 1 తర్వాత రిటర్ను ఫైల్‌ చేస్తుంటే ఈ జరిమానా రూ.10,000. అయితే, రిటర్ను దాఖలు చేసే వారి వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉంటే, జరిమానా కేవలం రూ.1,000 మాత్రమే ఉంటుంది. తక్కువ పన్ను పరిధిలో ఉన్న వారిపై భారం ఎక్కువ ఉండకూడదని తక్కువగా నిర్ణయించారు.  
గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే, మూలధన నష్టాలను, వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చిన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు వీలుండదు.  
ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేస్తే, అంతకాలానికి నిర్ణీత పన్నుపై వడ్డీ కూడా చెల్లించుకోవాలి.  
ఆలస్యంగా రిటర్నుల వల్ల, రిఫండ్‌ వచ్చేది ఉంటే ఆ మొత్తంపై వడ్డీ రాదని గుర్తుంచుకోవాలి.

ఆలస్యపు రిటర్నుల్లో పన్నుపై వడ్డీ
ఆలస్యపు రిటర్నుల్లో జరిమానాకు తోడు పన్ను మొత్తంపై ఆలస్యమైన కాలానికి వడ్డీ  చెల్లించాలి. సెక్షన్ 234ఏ కింద నెలకు ఒక శాతం వడ్డీ ఉంటుంది. నిర్ణీత గడువు, దాఖలు చేసిన గడువు మధ్య కాలానికి దీన్ని వసూలు చేస్తారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు ఆగస్టు 31. ఈ నెల 31లోపు దాఖలు చేయకుండా వచ్చే డిసెంబర్‌ 30న దాఖలు చేశారనుకోండి. రూ.1,00,000 పన్ను చెల్లించాల్సి ఉంటే, ఈ మొత్తంపై ఒక శాతం వడ్డీ చొప్పున నాలుగు నెలలకు రూ.4,000 చెల్లించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు