ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీపై ఆందోళనల్లేవు

24 Sep, 2018 00:39 IST|Sakshi

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌...

రుణ సదుపాయం కొనసాగుతుందని భరోసా  

న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ) లిక్విడిటీ విషయంలో ఆందోళనలేవీ లేవని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆ సంస్థలకు రుణపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఐఎఫ్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో  రుణ సంక్షోభం నేపథ్యంలో రజనీష్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల ఆరంభంలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌.. సిడ్బీకి చెల్లించాల్సిన రూ.1,000 కోట్ల స్పల్పకాలిక రుణాల్లో డిఫాల్ట్‌ కావడం, మరో సబ్సిడరీ 500 కోట్ల మేర డిఫాల్ట్‌ అయినట్లు బయటపడటం తెలిసిందే.

దీంతో రేటింగ్‌ ఏజెన్సీలు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ బాండ్‌లను జంక్‌ గ్రేడ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఈ సమస్యలు ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకూ పాకొచ్చని... వాటి నిధుల సమీకరణ వ్యయం ఎగబాకి, లాభదాయకతలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న భయాలు మార్కెట్లను చుట్టుముట్టాయి. దీంతో గత శుక్రవారం ఆయా కంపెనీల షేర్లలో తీవ్రమైన అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఏకంగా 60 శాతం కుప్పకూలగా.. ఇతర ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు కూడా భారీగానే పడిపోయాయి.

మనీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గడం, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై స్పష్టత లేకపోవడం వల్లే ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు పడిపోయేందుకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. ‘ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాల విషయంలో ఎస్‌బీఐ తటపటాయిస్తుందోందంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థంపర్థం లేదు. అవన్నీ వదంతులే. నిబంధనలలకనుగుణంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీలన్నింటికీ ఎస్‌బీఐ రుణాల మద్దతు కొనసాగుతుంది’ అని ఎస్‌బీఐ చైర్మన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు