ధరలు తగ్గే అవకాశమే లేదు..

13 Dec, 2014 16:36 IST|Sakshi
ధరలు తగ్గే అవకాశమే లేదు..

ఇప్పటికే 30-40 శాతం నష్టాల్లో స్థిరాస్తి అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పరిణామాలు హైదరాబాద్ స్థిరాస్తి విపణిపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని చూపాయని, ఈ ఏడాది నమోదైన రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జనరల్ సెక్రటరీ, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి చెప్పారు. 2010 నుంచి చూస్తే ప్రతి ఏటా హైదరాబాద్ మార్కెట్లో సగటున 4.9 శాతం వృద్ధి నమోదైతే.. ఈ ఏడాది మాత్రం 30-40 శాతం వరకు నష్టాల్లోనే స్థిరాస్తి అమ్మకాలున్నాయని పేర్కొన్నారు.

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగం విస్తరించి ఉన్న నగరాలన్నింటిలో కంటే హైదరాబాద్‌లోనే రియల్ ధరలు తక్కువగా ఉన్నాయని, అందుకే ధరలు ఇంకా తగ్గే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది.. ఇక రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధే ప్రధాన ధ్యేయం కాబట్టి మళ్లీ స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 హైదరాబాద్  రియల్టీ మార్కెట్ గురించి క్రేడాయ్ జనరల్ సెక్రటరీ ఎస్. రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.

ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి ఇలా దాదాపు 22 ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. దీనికి ఎంతలేదన్నా మూడేళ్ల సమయం పట్టడంతో పాటు చేతిచమురూ వదులుతోంది. పెపైచ్చు ఒక్కో ప్రాజెక్ట్‌పై 40 శాతం వడ్డీ భారం పడుతోంది. అదే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-గిఫ్ట్‌లో అయితే అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక్క ఎన్‌ఓసీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో నిర్మాణ సంస్థలకు భారం తగ్గడంతో పాటు పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ సంస్థలూ ముందుకొస్తాయి. అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ ఒకే ఎన్‌ఓసీ, ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకునే వెసులుబాటును కల్పించాలి. అప్పుడే స్థిరాస్తి అమ్మకాలు జోరందుకుంటాయి.
 
ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ స్థిరమైన ప్రభుత్వాలుండటం, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో 2015లో స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం సంతరించుకుంటుంది. మన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సగానికి పైగా రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తుంది. అంటే హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతగా వృద్ధిపథంలోకి వెళ్తుందన్నమాట. అందుకే హైదరాబాద్‌లో పటిష్టమైన పోలీస్ విభాగం, హైవేలు, స్కైవేలు, మల్టీలేయర్ ఫ్లై ఓవర్లు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు, ఓఆర్‌ఆర్ అవతలి ప్రాంతాలను కలుపుతూ మరో రీజనల్ రింగ్ రోడ్డు, నగరానికి ఉత్తరాన మరో అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం చుట్టూ సినిమా, ఫార్మా, హెల్త్, స్పోర్ట్స్ వంటి సిటీల నిర్మాణం, స్లమ్ ఫ్రీ సిటీ, ఐటీఐఆర్ వంటి కీలకమైన ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. 2015 సంవత్సరంలో ఆయా ప్రాజెక్ట్‌లు 20-30 శాతం నిర్మాణ దశలోకి వచ్చినా సరే.. ఇక స్థిరాస్తి రంగాన్ని ఎవరూ ఆపలేరు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన నేపథ్యంలో ఆరేడు నెలలుగా హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీకి వెళ్లాయి. మరో ఐదు నెలల్లో ఏపీలో రాజధాని కేటాయింపు, భూసేకరణ వంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లిన పెట్టుబడుల్లో కొంత మళ్లీ నగరానికే వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే అభివృద్ధి చెంది ఉంది. కంపెనీలు, ఉద్యోగాలూ ఉన్నాయి. మరోవైపు నగరంలో కంపెనీల స్థాపనకు, విస్తరణకూ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం కల్పిస్తున్నందున హైదరాబాద్‌లోని ఐటీ, బీపీఓ, ఫార్మా కంపెనీలు తమ కార్యాలయాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్‌ల సంఖ్య 25 శాతం పెరగవచ్చని, అదే సమయంలో అమ్మకాలు 15 శాతం మేరకు పెరుగుదల ఉంటుందని అంచనా.

ఏపీ ప్రభుత్వం తరహాలోనే ‘మీ సేవ’, ఆన్‌లైన్ ద్వారా.. కావాల్సిన పరిమాణం నమోదు చేసుకుంటే నేరుగా వినియోగదారుల ఇంటికే ఇసుకను పంపించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా డిపోలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ, ఇసుక కొనుగోళ్లపై ఆయా జిల్లా కలెక్టర్లకు అధికారం ఇవ్వాలి. అలా కాకుండా డ్వాక్రా సంఘాలకు, గ్రామ పంచాయతీలకు అధికారమిస్తే స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మకై విధానం పక్కదారిపట్టే ప్రమాదముంది. ప్రభుత్వ ఆదాయం పెరిగేలా తీసుకొస్తున్న విధానం కనుక అది నిర్మాణ రంగం, పర్యావరణం మధ్య సమతౌల్యం సాధించేలా ఉండాలి. నదుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా, జీపీఎస్ సాంకేతికతను వినియోగించాలి. వే బిల్లుల జారీని పక్కాగా అమలు చేయాలి.
 
ఫిబ్రవరిలో మరో రెండు ప్రాజెక్ట్‌లు..
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయంగా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ ఎస్. రాంరెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైదర్‌నగర్‌లో 9 ఎకరాల్లో నిర్మిస్తున్న ‘ఎస్‌ఎంఆర్ ఫౌంటెన్‌హెడ్’ దాదాపు పూర్తయ్యింది. మొత్తం 975 ఫ్లాట్లు. 30-40 ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ధర చ.అ.కు రూ.3,800.

బండ్లగూడలో 15 ఎకరాల్లో ఎస్‌ఎంఆర్ వినయ్ హార్మోనికౌంటీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. తొలి దశలో 450 ఫ్లాట్లొస్తాయి. మరో 15 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ధర చ.అ.కు రూ.3,200.

ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను, బెంగళూరులో మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

మరిన్ని వార్తలు