‘బిల్లు ఇవ్వకుంటే..డబ్బులు ఇవ్వకండి’

21 Mar, 2018 11:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల్లో ఆహార పదార్ధాలపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన ఫిర్యాదులపై అధికారులు తీరిగ్గా స్పందించారు. గత ఏడాది ఆహార పదార్ధాల ధరల పట్టికను తెలుపుతూ ఐఆర్‌సీటీసీ ట్విటర్‌లో మెనూ కార్డును విడుదల చేసింది. అయితే రైళ్లలో మాత్రం ఆహార పదార్ధాలను అధిక ధరలకే విక్రయిస్తున్నారు. తాజాగా దీనిపై రైల్వే మం‍త్రి పీయూష్‌ గోయల్‌ విధాన నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు బిల్లులు లేకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తే వాటికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రయాణీకులు తాము కొనే ఆహార పదార్ధాలకు బిల్లులను అడిగి తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. రైల్వే క్యాటరర్స్‌ అధిక చార్జీలను వసూలు చేస్తే పసిగట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. మార్చి 31 నుంచి రైళ్లలో ఈ పద్ధతి అమల్లోకి వస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆహార పదార్ధాలను అధిక ధరలపై విక్రయించడంపై పరిశీలించేందుకు ఇన్‌స్పెక్టర్లను కూడా ప్రత్యేకంగా నియమించనున్నట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు