అమ్మకానికి ఎయిర్‌ ఇండియా?

31 May, 2017 13:26 IST|Sakshi

న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ  ఏకైక స్వదేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేసేందుకు  దాదాపు రంగం సిద్ధమైంది. కుంభకోణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను నష్టాలు వస్తున్నాయనే కారణంతో విక్రయించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.   రుణ భారంతో ఉన్న ఎయిర్‌ లైన్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు దేశంలోని టాప్ థింక్-ట్యాంక్ నితి ఆయోగ్ సిఫార్సు చేసింది.

సీనియర్‌ అధికారులు సమాచారం ప్రకారం  ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) కు  సమర్పించిన సిఫారసులలో ఎయిర్ ఇండియాలో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను   నీతి  ఆయోగ్‌ ప్రతిపాదించింది.  ఈ బిడ్డింగ్‌ ప్రక్రియలో దేశీయ, ప్రైవేట్ ఎయిర్లైన్స్ కు అవకాశం కల్పించాలని కోరింది.  ఎయిర్‌ ఇండియాకు రూ.30 వేల కోట్ల రుణాల  రైట్‌ ఆఫ్‌  సహా  దీనికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను ప్రభుత్వానికి సమర్పించింది.

ఈ సిఫారసుకు మద్దతుగా వివిధ అంతర్జాతీయ ఉదాహరణలకు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, జపాన్‌ ఎయిర్‌ లైన్స్‌, ఆస్ట్రియన్‌ ఎయిర్ లో  ఆయా ప్రభుత్వాలు మొత్తం వాటాలను విక్రయించినట్టు సూచించారు. అయితే దీనిపై స్పందించిన  కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు  నీతి ఆయోగ్‌  సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై హింట్‌ ఇచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్ సిఫార్సులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  గత వారంలో ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా  14 శాతం మార్కెట్ వాటాతో ,రూ 50 వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టు వ్యాఖ్యానించారు.

మరోవైపు  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్లైన్స్‌పై  దర్యాప్తు ప్రారంభించింది.  ఈ ఒప్పందం ద్వారా రూ. 70,000 కోట్ల విలువైన 111 బోయెంగ్‌ విమానాలను  కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా మరింత అప్పుల ఊబిలోకి కూరకుపోయిందని సీబీఐ ఆరోపించింది. దీనికి సంబంధించి విమానయాన శాఖ, ఎయిర్‌ ఇండియాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై కేసలు నమోదు చేసింది.  సిబిఐ విచారణకు  సహకరిస్తామని పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్ గజపతి  ప్రకటించారు.   కాగా ఎయిర్‌ ఇండియా  మొత్తం అప్పులు రూ. 60వేల కోట్లు. అందులో రూ. 21,000 కోట్ల విమానాల సంబంధిత రుణాలు, రూ .8 వేల కోట్ల మూలధన పెట్టుబడి ఉన్నాయి.

మరిన్ని వార్తలు