ఐటీలో మరో రెండేళ్లు ఉద్యోగాల కోత

15 May, 2017 09:20 IST|Sakshi
ఐటీలో మరో రెండేళ్లు ఉద్యోగాల కోత

కొత్త టెక్నాలజీలు...అమెరికా తదితర దేశాల విధానాల ప్రభావం
మెరుగుదిద్దుకునేందుకు అవకాశమని నిపుణుల సూచన


న్యూఢిల్లీ/బెంగళూరు: డిజిటలీకరణ, యాంత్రీకరణ (ఆటోమేషన్‌)కు తోడు అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగ వీసా విధానాలు మారిన ఫలితంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్‌ మహింద్రా తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని, ఈ ధోరణి మరో ఒకటి రెండేళ్ల పాటు కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఏటా పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా వేలాది మందికి పింక్‌ స్లిప్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇది నాణేనికి ఒకవైపే.

వాస్తవానికి పలు దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న రక్షణాత్మక విధానాలు పెరిగిన క్రమంలో ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు జరుగుతోందన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఇటీవలి కాలంలో అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఉద్యోగుల వీసా నిబంధనలు కఠినతరం కావడంతో దేశీయ ఐటీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో సరికొత్త టెక్నాలజీలు అయిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వాటివల్ల తక్కువ ఉద్యోగులతోనే ఎక్కువ పని సాధ్యమవుతోంది.

దీంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ విధానాలను తిరిగి సమీక్షించుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మాన్యువల్‌ టెస్టింగ్, టెక్నాలజీ సపోర్ట్, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటోంది. ఈ పనులను ఆటోమేషన్‌ టెక్నాలజీలతో నిర్వహించే అవకాశం ఉండటమే అందుకు కారణం. అదే సమయంలో డేటాసైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ డొమెన్‌ నైపుణ్యాలకు డిమాండ్‌ పెరిగిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

తొలగింపు సాధారణమే..: అందుబాటులో ఉన్న ఉద్యోగుల నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా లేవని, చాలా మంది తాము నిరుపయోగమని గుర్తిస్తున్నట్టు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఈవీపీ, సహ వ్యవస్థాకులు రీతూపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. ‘‘కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది పరిశ్రమలో ప్రతీ 3–5 ఏళ్లకు ఒకసారి జరిగేదే. కానీ, విదేశీ ఐటీ ఉద్యోగుల విషయంలో అమెరికా తన విధానాలు మార్చడంతో ఈ సారి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది’’ అని గ్లోబల్‌హంట్‌ ఎండీ సునీల్‌ గోయెల్‌ అన్నారు. ఈ క్రమబద్ధీకరణ రెండేళ్ల పాటు కొనసాగొచ్చన్నారు. కానీ, కొత్త తరం టెక్నాలజీలకు అనుగుణంగా  మెరుగుదిద్దుకునేందుకు ఐటీ నిపుణులకు ఇదొక అవకాశమని సూచించారు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్‌ మహింద్రా, విప్రో కంపెనీల్లోని 7,60,000 ఉద్యోగాల్లో 2–3% కోత ఉంటుందని జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు