నోట్ల డిపాజిట్లకు నో మోర్ ఛాన్స్

8 Apr, 2017 19:24 IST|Sakshi
నోట్ల డిపాజిట్లకు నో మోర్ ఛాన్స్
రద్దయిన నోట్ల డిపాజిట్లకు ఇక ఎలాంటి అవకాశాలు ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. జూన్ 30 వరకు గ్రేస్ పిరియడ్ పెంచమంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నవంబర్ 8న హఠాత్తుగా పెద్దనోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన అనంతరం వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు సాధారణ ప్రజలకు డిసెంబర్ 30 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులకు, బ్లాక్ మనీ హోల్డర్స్ కు మరో అవకాశంగా మరో మూడు నెలలు అదనంగా మార్చి 31 వరకు టైమిచ్చింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ప్రస్తుతం రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఇక ఎలాంటి సమయం  ఇవ్వమని, గ్రేస్ పిరియడ్ పెంచడానికి ఎలాంటి తాజా నోటిఫికేషన్ తీసుకురావడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
 
అదేవిధంగా నోట్ల రద్దయిన కాలంలో జరిపిన దాడుల్లో, రికవరీల్లో మొత్తం లెక్కలో చూపని నగదుగా రూ.5,400 కోట్లను కేంద్ర ఏజెన్సీలు గుర్తించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాలకు సంబంధించిన ఓ అఫిడివిట్ ను ప్రభుత్వం, సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల డిపాజిట్లను ఆర్బీఐ స్వీకరించడం లేదని, ఇది నవంబర్ 8న జారీచేసిన నోటిఫికేషన్ విరుద్ధమని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టులో తమ పిటిషన్లను దాఖలు చేశాయి. ఎన్ఆర్ఐలకు ఇచ్చిన మాదిరిగా తమకు సమయమివ్వాలని కోరుతూ ఈ పిటిషన్ ను నమోదుచేశారు.. ఆ పిటిషన్లకు స్పందించిన ప్రభుత్వం, సమయం కోరడానికి పిటిషన్ దారులకు ఎలాంటి హక్కులు లేవని ప్రభుత్వం తేల్చిచెప్పింది. 
 
>
మరిన్ని వార్తలు