చిప్స్‌ కింగ్‌కు శాంసంగ్‌ చెక్

27 Jul, 2017 20:33 IST|Sakshi
చిప్స్‌ కింగ్‌కు శాంసంగ్‌ చెక్
సియోల్‌ : కంప్యూటర్‌ చిప్స్‌ విభాగంలో అగ్రగామిగా, రెండు దశాబ్దాలకు పైగా తన హవా చాటుతున్న సిలికాన్‌ సెమీకండక్టర్‌ ఇంటెల్‌కు దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ చెక్‌ పెట్టింది. కంప్యూటర్‌ చిప్స్‌ విభాగంలో ఇంటెల్‌ను వెనక్కి నెట్టేసి శాంసంగ్‌ రారాజుగా నిలిచింది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో శాంసంగ్‌ లాభాలు రికార్డు స్థాయిలో జంప్‌ చేశాయి. దీంతో ఇంటెల్‌కు శాంసంగ్‌ చెక్‌ పెట్టినట్టు విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో ఇంటెల్‌ను శాంసంగ్‌ పక్కకు నెట్టేసినట్టు పేర్కొన్నారు. శాంసంగ్‌ మొత్తం 17.6 ట్రిలియన్‌(రూ.1,01,284కోట్ల) రెవెన్యూల నిర్వహణ ఆదాయాల్లో సెమికండక్టర్‌ బిజినెస్‌ల నుంచే 8 ట్రిలియన్లు(రూ.46,157కోట్లకు పైగా) వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఇంటెల్‌ కూడా నేడే ఫలితాలను ప్రకటించనుంది. కానీ దీని క్వార్టర్లీ రెవెన్యూలు 14.4 బిలియన్‌ డాలర్లుగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అంటే రూ.92,314 కోట్లు మాత్రమేనని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వార్షికంగా ఇంటెల్‌ విక్రయాలను శాంసంగ్‌ అధిగమించినట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
 
ఇప్పటికే మొబైల్‌ డివైజ్‌లు, డేటాలో శాంసంగ్‌ ఆధిపత్య స్థానంలో ఉంది. ఈ కంపెనీ చీఫ్‌ జైలుకి వెళ్లినప్పటికీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ శాంసంగ్‌ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది గెలాక్సీ నోట్‌7 దెబ్బతో భారీ నష్టాలను ఎదుర్కొని, పరువు ప్రతిష్టలు కోల్పోయిన ఈ సంస్థ మళ్లీ రికవరీ అయింది. దశాబ్దం పైన నుంచి శాంసంగ్‌, ఇంటెల్‌ సెమీకండక్టర్‌ మార్కెట్‌లో తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. పర్సనల్‌ కంప్యూటర్లకు ప్రాసెసర్లను అందించడంలో ఇంటెల్‌ కంపెనీనే ఆధిపత్యంలో ఉంది. 1992 నుంచి ఈ కంపెనీనే ప్రపంచపు అతిపెద్ద సెమీ కండక్టర్‌ కంపెనీగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఆ స్థానాన్ని శాంసంగ్‌ లాగేసుకున్నట్టు తెలిసింది. కంప్యూటర్లకు బదులు టాబ్లెట్లు, పీసీలు, స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వాడుతుండటంతో, శాంసంగ్‌ లాంటి కంపెనీలు పైకి ఎగుస్తున్నట్టు ఓ సీనియర్‌ విశ్లేషకుడు చెప్పారు.  
మరిన్ని వార్తలు