చోక్సీకి షాక్‌ : ప్రభుత్వానికి ఊరట

28 Jul, 2018 11:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు, గీతాంజలి సంస్థల అధిపతి  మెహుల్‌  చోక్సికి  దిమ్మతిరిగే వార్త ఇది.   వ్యాపార విస్తరణకోసం ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నానని ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా అక్కడి ప్రభుత్వం స్పందించింది.  తమదేశ పౌరసత‍్వం దుర్వినియోగానికి తాము అనుమతించమని స్పష్టం చేసింది. ద్రోహులకు తమ నేలపై దాక్కునేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది.    ఈ మేరకు ఆంటిగ్వా ,  బార్బుడా విదేశాంగ మంత్రి ఇ. పాల్‌ చెట్ గ్రీన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న డైమండ్‌ వ్యాపారి  చోక్సీకి చెక్‌ పెట్టే క్రమంలో కేంద్రానికి ఊరట కల్గించేలా ఆంటిగ్వా ప్రభుత్వం స్పందించింది.  చోక్సీకి సంబంధించి భారత ప్రభుత‍్వం నుంచి ఎలాంటి అభ్యర్థన  తమకు చేరలేదని తెలిపింది. చోక్సీ పౌరసత్వం రద్దు,  లేదా అరెస్టు కోసం న్యూఢిల్లీ నుండి అధికారికంగా తమను ఎవరూ సంప్రదించలేదని   చెప్పింది. భారతదేశ వ్యాపారవేత్త  చోక్సిని బహిష్కరించాలని భావించి, అటువంటి అభ్యర్ధనను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, వారికి ఆంటిగ్వా స్వర్గంగా మారిందన్న  విమర్శను  విదేశాంగ మంత్రి తోసిపుచ్చారు.  ఆటింగ్వా ప్రభుత్వ సానుకూల స్పందనపై కేంద్రం ఎలాంటి చర్యల్ని చేపట్టనుందో చూడాలి.

భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలను  కోరుకుంటున్నట్టు గ్రీన్‌ చెప్పారు.  ఇరు దేశాల సంబంధాలకు హాని కలిగించే చర్యల్ని  చేపట్టబోమని వెల్లడించారు. మరోవైపు చోక్సీ ఆటింగ్వాకు తలదాచుకున్న వైనం  అక‍్కడి  ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆటింగ్వా ప్రధాని మౌనంపై  విమర్శలు గుప్పించాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా  నాయకులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు