పదో ఏడాదీ అంబానీ వేతనం రూ.15 కోట్లే 

8 Jun, 2018 00:59 IST|Sakshi

2008–09 నుంచి  అందుకునేది ఇంతే 

ఆయనను ఆదర్శంగా తీసుకోని బోర్డు డైరెక్టర్లు

వారి వేతనాల్లో ఏటేటా పెరుగుదల 

న్యూఢిల్లీ: దేశీయ కుబేరుడు, రిలయన్స్‌ సామ్రాజ్యాధినేత ముకేశ్‌ అంబానీ వరుసగా పదో ఏడాది కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తీసుకున్న వార్షిక వేతనం రూ.15 కోట్లకే పరిమితమైంది. ముకేశ్‌ అంబానీ వేతనం, అలవెన్సులు, కమిషన్లు అన్నీ కలిపి రూ.15 కోట్ల పరిమితిని నిర్ణయించుకుని 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి అంతే మొత్తాన్ని తీసుకుంటూ వస్తున్నారు. అంతకు పూర్వం ఆయన తీసుకున్న వార్షిక మొత్తం రూ.24 కోట్లుగా ఉంది. తాజాగా ముగిసిన 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ ముకేశ్‌ అంబానీ రూ.15 కోట్లనే అందుకోవడం గమనార్హం. ‘‘చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ముకేశ్‌ డి అంబానీ వేతన ప్రతిఫలాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించుకున్నారు. నిర్వహణ స్థాయిల్లోని వారి వేతనాలు మోస్తరు స్థాయిలోనే ఉండాలని, అందుకు తాను ఆదర్శంగా ఉండాలన్న ఆయన ఆకాంక్షను ఇది ప్రతిఫలిస్తోంది’’ అని 2017–18 వార్షిక స్టేట్‌మెంట్‌లో కంపెనీ పేర్కొంది. కానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో బోర్డు డైరెక్టర్లు, సోదరులు నిఖిల్, హితల్‌ మేశ్వాని మాత్రం ముకేశ్‌ను ఆదర్శంగా తీసుకోవడంలేదు. పదేళ్ల క్రితం నిర్ణయించుకున్న పరిమితినే ముకేశ్‌ ఇప్పటికీ కొనసాగిస్తుండగా, ఈ కాలంలో మిగిలిన వారి వేతన, ఇతర భత్యాలు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. 

వేతన వివరాలు ఇవీ...  
2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను ముకేశ్‌ అంబానీ వేతనం, అలవెన్సులు రూ.4.49 కోట్లు, కమిషన్‌ 9.53 కోట్లు, ఇతర భత్యాలు 27 లక్షలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.71 లక్షలుగా ఉన్నాయి. ఇక, ఆయన సోదరులు నిఖిల్‌ ఆర్‌ మేశ్వాని, హితల్‌ ఆర్‌ మేశ్వాని మాత్రం రూ.19.99 కోట్ల చొప్పున తీసుకున్నారు. వీరిద్దరు 2016–17లో రూ.16.58 కోట్ల చొప్పున అందుకున్నారు. 2015–16లో నిఖిల్‌ రూ.14.42 కోట్లు, హితల్‌ రూ.14.41 కోట్లు తీసుకోగా, 2014–15లో రూ.12.03 కోట్ల చొప్పున వేతన భత్యాలు తీసుకున్నారు. కంపెనీలో కీలక పాత్ర పోషించే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌ పారితోషికం 2016–17లో రూ.7.87 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.8.99 కోట్లకు పెరిగింది. ఇక ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అందుకున్న వేతనం రూ.1.5 కోట్లు. దీనికి రూ.6 లక్షల సిట్టింగ్‌ ఫీజులు అదనం. ఇతర నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సైతం ఇంతే మొత్తం స్వీకరించారు.   

మరిన్ని వార్తలు