పన్ను బకాయిలేమీ లేవు

28 Jan, 2019 04:37 IST|Sakshi

ఐటీ నుంచి మైండ్‌ట్రీ షేర్లు విడిపించుకుంటాం 

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ చెబుతున్నట్లుగా తమ కంపెనీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టం చేసింది. బాకీలు రాబట్టుకోవడం కోసమంటూ ఆదాయపన్ను శాఖ అటాచ్‌ చేసుకున్న మైండ్‌ట్రీ షేర్లను విడిపించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. ‘ఆదాయ పన్ను శాఖ 148, 153ఎ సెక్షన్ల కింద ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా ప్రమోటరు, కంపెనీ సవరించిన రిటర్నులను దాఖలు చేయడం జరిగింది.

వీటి ప్రకారం.. కంపెనీ, దాని అనుబంధ సంస్థలు గానీ, ప్రమోటరు గానీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవు‘ అని స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. సీసీడీ కాఫీ చెయిన్‌ను కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వహిస్తోంది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, దాని ప్రమోటరు సిద్ధార్థ రిటర్నుల్లో చూపిన దానికంటే మరింత ఎక్కువ మొత్తం పన్నులు చెల్లించాల్సి ఉంటుందనే కారణంతో.. ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో వారికున్న వాటాల్లో కొంత భాగాన్ని ఐటీ శాఖ అటాచ్‌ చేసింది. వీటినే విడిపించుకునేందుకు కాఫీ డే, సిద్ధార్థ ప్రయత్నాల్లో ఉన్నారు. 

వివాదమిదీ..  
ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి పెట్టుబడులతో తోడ్పాటునందించిన వీజీ సిద్ధార్థ గ్రూప్‌నకు ఈ కంపెనీలో 21 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం మరో ఐటీ సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌కు ఈ వాటాలను విక్రయించేందుకు సిద్ధార్థ చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది పూర్తయితే నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం టేకోవర్‌ చేసిన కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి రావొచ్చు. అయితే, మైండ్‌ట్రీలో కాఫీ డే వాటాల విక్రయాన్ని సుబ్రతో బాగ్చి, ఎన్‌ఎస్‌ పార్థసారథి తదితర వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్నారు.

మేనేజ్‌మెంట్‌ మద్దతు లేకుండా ఈ డీల్‌ సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈలోగా మైండ్‌ట్రీలో సిద్ధార్థకు ఉన్న షేర్లలో 22.2 లక్షల షేర్లు, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కున్న 52.7 లక్షల షేర్లను ఐటీ శాఖ అటాచ్‌ చేసుకుంది. జనవరి 25తో మొదలుకుని ఆరు నెలల పాటు ఈ ఆర్డరు అమల్లో ఉండనుంది. దీంతో సిద్ధార్థ వాటాల విక్రయ ప్రక్రియకు మరిన్ని అడ్డంకులు ఎదురయ్యేట్లు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు