బీమాలో నామినీ ఉండాల్సిందే...

20 Jul, 2014 00:21 IST|Sakshi
బీమాలో నామినీ ఉండాల్సిందే...

జీవిత బీమా తీసుకునే వారు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ తదనంతరం బీమా ప్రయోజనం ఎవరికి అందాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. పాలసీదారుని మరణానంతరం ఆ వ్యక్తి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే జీవిత బీమా ముఖ్యోద్దేశం. అందుకే, బీమా పత్రాలు నింపేటపుడు నామినీ వివరాలు స్పష్టంగా పేర్కొనాలి.
 
పాలసీలో నామినీలను పేర్కొనకపోతే బీమా మొత్తాన్ని పొందడానికి పాలసీదారుని కుటుంబ సభ్యులు ఎన్నో ఇక్కట్లకు గురికావలసి వస్తుంది. కోర్టులు జారీచేసే వారసత్వ సర్టిఫికెట్ తీసుకురమ్మని బీమా కంపెనీలు కోరతాయి. ఈ సర్టిఫికెట్‌ను పొందడం అంత సులువు కాదు. అందుకే, బీమా ప్రపోజల్ ఫారంలోనే నామినీ(ల)ను స్పష్టంగా రాస్తే సరిపోతుంది.
 
నామినీ అంటే...

తన తదనంతం బీమా సొమ్ము ఎవరికి అందాలని పాలసీదారు ప్రతిపాదిస్తాడో ఆ వ్యక్తినే నామినీ అంటారు. నామినీ పూర్తి వివరాలను, పాలసీదారునితో ఆ వ్యక్తి బంధుత్వాన్ని ప్రపోజల్ ఫారంలో స్పష్టంగా పేర్కొనాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే... పాలసీదారునికి నామినీ చట్టపరంగా వారసుడు/ వారసురాలు అయి ఉండాలి. లేదంటే నామినేషన్ చెల్లదు. చట్టం ప్రకారం పాలసీదారుని తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు నామినేషన్‌కు అర్హులు. ఒకవేళ నామినీ మైనర్ అయితే అతనికి/ ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు కస్టోడియన్‌ను నియమించాలి.
 
గుర్తుంచుకోవాల్సినవి...
* పాలసీ గురించి, నామినేషన్ గురించి నామినీకి, కుటుంబ సభ్యులకు తెలపాలి. తద్వారా, పాలసీదారు లేనపుడు వారు అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది.
* పాలసీ కాలపరిమితి ముగిసేలోపు నామినీ దురదృష్టవశాత్తూ మరణిస్తే బీమా కంపెనీని సంప్రదించి కొత్త నామినీని పేర్కొనాలి.
* ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో నామినీలుంటే వ్యవహారం సహజంగానే సంక్లిష్టమవుతుంది. కొన్నిసార్లు న్యాయ వివాదాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా సొమ్మును ఒక నామినీకే ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తాయి. అందుకుగాను సదరు నామినీ మిగిలిన నామినీల నుంచి అంగీకారాన్ని పొందాల్సి ఉంటుంది. మిగిలిన నామినీలు అంగీకారం తెలిపే సమయంలో వివాదాలు ఏర్పడుతుంటాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు