పీఎన్‌బీ స్కాం: అంబానీ సహా నలుగురిపై ఆంక్షలు

20 Feb, 2018 10:49 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: పీఎన్‌బీ కుంభకోణంలో దర్యాప్తు అధికారులు వేగంగా కదులుతున్నారు. ఈ కేసులో  ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి చెందిన  కీలక అధికారుల కదలికలపై తాజాగా ఆంక్షలు విధించారు.  నీరవ్‌ మోదీ కంపెనీకి చెందిన నలుగురు  సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లపై ట్రావెల్‌ ఆంక్షలు ​విధించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ బ్యాంకును రూ.11,400కోట్ల మేర మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. వీరు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలనే యోచనతో, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.  

మోదీ కంపెనీకి చెందిన భాగస్వాములు, సీనియర్‌ అధికారులు తమ అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ ఆదేశించింది.  ముఖ్యంగా సోమవారం సాయంత్రం టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు విపుల్‌ అంబానీ, రవిగుప్త సహా నలుగురిని విచారించిన అనంతరం సీబీఐ ఈ ఆదేశాలిచ్చింది. ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఆర్థిక, కార్పొరేట్, అభివృద్ధి  ప్రెసెడెంట్‌,  విపుల్‌ అంబానీ,  ప్రధాన ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)  రవి గుప్తా,  అంతర్జాతీయ ఫైనాన్స్ డివిజన్ అధ్యక్షుడు సౌరబ్ శర్మ, మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుభాష్ పరాబ్‌ లను దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. అంతకుముందు దేశ, విదేశాలలో సంస్థ  వ్యాపార  లావాదేవీలు  ఇతర వివరాల గురించి వీరిని ఆరా తీసింది. అలాగే కవితా  మణిక్కర్ (అధీకృత సంతకం), ఎమిల్లా (వ్యక్తిగత సహాయకుడు), ప్రతీక్‌ మిశ్రాలతో సహా  మరి కొంతమంది అధికారులకు  కూడా సమన్లు జారీ చేసింది.

మరోవైపు  పీఎన్‌బీకి ముంబై బ్రాడి హౌస్ చెందిన మరో ముగ్గురు అధికారులు  బీహూ తివారీ (చీఫ్ మేనేజర్, ఫారెక్స్ శాఖ), యశ్వంత్ జోషి (ఫారెక్స్  డివిజన్‌ స్కేల్ II మేనేజర్)  ప్రఫుల్ సావంత్ (స్కేల్ I అధికారి, ఎక్స్‌పోర్ట్‌) లను సోమవారం సాయంత్రం సీబీఐ  అరెస్టు  చేసింది.

మరిన్ని వార్తలు