మార్కెట్‌పై ‘కొరియా’ ఎఫెక్ట్‌

4 Sep, 2017 01:10 IST|Sakshi
మార్కెట్‌పై ‘కొరియా’ ఎఫెక్ట్‌

హైడ్రోజన్‌ బాంబ్‌ ప్రయోగంతో మళ్లీ పెరగనున్న ఉద్రిక్తతలు
కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ప్రభావం కూడా
ఈసీబీ వ్యాఖ్యలపై అందరి దృష్టి


ముంబై: ఉత్తర కొరియా హైడ్రోజన్‌ బాంబ్‌ ప్రయోగం.. ఈ వారం ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్‌పై కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశముందని నిపుణులంటున్నారు. దీంతోపాటు క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ, సేవల రంగ సంబంధిత గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌ గమనంపై ఉంటుందని వారంటున్నారు. ఇవేకాకుండా...అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు.. తదితర అంశాలు స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.

మళ్లీ యుద్ధ మేఘాలు...
ఉత్తర కొరియా తాజాగా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించడం, తమ దగ్గర హైడ్రోజన్‌ బాంబ్‌ ఉందని వెల్లడించడం స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపనున్నది. గత వారం తగ్గాయనుకున్న అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు,  ఉత్తర కొరియా తాజా అణ్వస్త్ర పరీక్షతో మళ్లీ పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.   

అంతర్జాతీయ ట్రెండ్‌ ప్రకారం....
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం, ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న కంపెనీల క్యూ1 ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని సిస్టమాటిక్స్‌ షేర్స్‌ అండ్‌ స్టాక్స్‌ సంస్థ హెడ్‌ (రీసెర్చ్‌అండ్‌ ఫండ్స్‌) అరుణ్‌ గోపాలన్‌ చెప్పారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు. ఈ వారంలో వివిధ ఆర్థిక గణాంకాలు వెల్లడవుతాయని, అయితే ఈ గణాంకాలేవీ మార్కెట్‌ పురోగమనాన్ని అడ్డుకోలేవని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  హెడ్‌(పీసీజీ, క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ) వి.కె. శర్మ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు నెల సేవా రంగానికి సంబంధించిన పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ గణాంకాలు మంగళవారం (ఈ నెల 5న) వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు సంభవిస్తే అది మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌(రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు.  

కీలకంగా ఈసీబీ వ్యాఖ్యలు...
అమెరికాలో ఉద్యోగ వృద్ధి మందగించిందంటూ గత శుక్రవారం వెలువడిన గణాంకాలకు సోమవారం మన మార్కెట్‌ ప్రతిస్పందిస్తుంది.   ఈ ఏడాది జూన్, జూలైలో వ్యవసాయేతర ఉద్యోగాలు 4 లక్షల వరకూ పెరగగా, ఈ ఏడాది ఆగస్టులో 1.56 లక్షలు మాత్రమే పెరిగాయి. దీంతో ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని నిపుణులంటున్నారు. ఇక రెండు రోజుల యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సమావేశ నిర్ణయ ఫలితం గురువారం(ఈ నెల7న) వెలువడుతుంది. వడ్డీరేట్లపై యథాతథ స్థితినే ఈసీబీ కొనసాగించే అవకాశాలున్నాయి. అయితే ఈసీబీ చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. నెలవారీ బాండ్ల కొనుగోళ్లను వచ్చే నెల నుంచి తగ్గించనున్నట్లు ఈసీబీ వెల్లడిస్తుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

డెట్‌ మార్కెట్లోకి జోరుగా విదేశీ పెట్టుబడులు
భారత డెట్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. గత నెలలో డెట్‌మార్కెట్లో ఎఫ్‌పీఐలు  240 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. దీంతో ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల డెట్‌ పెట్టుబడులు 2,000 కోట్ల డాలర్లకు పైగా పెరిగాయి. వరుసగా ఏడో నెలలోనూ డెట్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల జోరు  కొనసాగింంది. అయితే గత నెలలో స్టాక్‌మార్కెట్‌ నుంచి మాత్రం 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు