అందరికీ లెసైన్స్‌లు ఇవ్వలేం! : దువ్వూరి సుబ్బారావు

5 Jul, 2013 01:32 IST|Sakshi
అందరికీ లెసైన్స్‌లు ఇవ్వలేం! : దువ్వూరి సుబ్బారావు
 కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల విషయంలో పరిమితి ఉండకపోవచ్చు. కచ్చితంగా ఇంతమందికే ఇవ్వాలని లేదు. దరఖాస్తు చేసిన కంపెనీలకు అర్హత ఉంటే ఎన్ని లెసైన్స్‌లైనా ఇవ్వొచ్చు. దేశంలో మారుమూల పల్లెలకూ బ్యాంకింగ్ సేవలను విస్తరింపజేయాలంటే భారీ సంఖ్యలో బ్యాంకుల అవసరం ఎంతైనా ఉంది.
 - రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి చిదంబరం మాటలివి
 నిబంధనల ప్రకారం అర్హతలున్న కంపెనీలన్నింటికీ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడం సాధ్యం కాదు.
  - ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి తాజాగా మరోమారు స్పష్టీకరణ 
 
 చెన్నై: కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం... రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మధ్య అభిప్రాయభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అర్హత ఉంటే ఎన్ని లెసైన్స్‌లైనా ఇవ్వొచ్చంటూ విత్తమంత్రి చెబుతుండగా... అర్హులైన వాళ్లందరికీ లెసైన్స్‌లు ఇవ్వడం సాధ్యంకాదంటూ దువ్వూరి మరోమారు స్పష్టం చేయడం దీనికి నిదర్శనం. గురువారం ఇక్కడ ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం దువ్వూరి విలేకరులతో మాట్లాడారు. 
 
 ‘కొత్త బ్యాంకులకు లెసైన్స్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేయనున్నాం. అయితే, అర్హత ఉన్న దరఖాస్తుదారులందరూ లెసైన్స్‌లను దక్కించుకోలేకపోవచ్చు. వచ్చే మూడు నాలుగు నెలల పాటు దరఖాస్తులను అంతర్గతంగా పరిశీలిస్తాం. అవసరమైతే అదనపు సమాచారాన్ని కూడా కంపెనీల నుంచి కోరతాం. అనంతరం మరో ప్రత్యేక కమిటీ వీటిని నిశితంగా మదింపు చేసి తగిన సిఫార్సులను అందజేస్తుంది. ఆ తర్వాత తుది లెసైన్స్‌ల జారీపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుంది.  ఎన్ని కొత్త బ్యాంకులకు అనుమతివ్వాలనేది ప్రస్తుతానికి మా మదిలో లేదు’ అని దువ్వూరి వ్యాఖ్యానించారు.
 
 టాటా, బిర్లా, అంబానీ గ్రూప్ కంపెనీలతో సహా మొత్తం 26 సంస్థలు బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదికి మార్చినాటికి లెసైన్స్‌లు మంజూరు కావచ్చని అంచనా. కాగా, నిబంధనల ప్రకారమే లెసైన్స్‌ల మంజూరు ఉంటుందని, దీనిలో ప్రభుత్వ జోక్యం ఉండబోదని చిదంబరం తాజాగా ప్రకటించారు. ఎంపికకు సంబంధించి సర్కారు ఎలాంటి సిఫార్సులూ చేయదని కూడా స్పష్టం చేశారు కూడా. ప్రస్తుతం దేశీయంగా 26 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ప్రైవేట్ బ్యాంకులు, 56 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. 
 
 బిర్లాలకు లెసైన్స్ డౌట్?
 బ్యాంకింగ్ లెసైన్స్ కోసం ఆదిత్య బిర్లా నువో దరఖాస్తుపై వివాదం తలెత్తే అవకాశం ఉందా అనేది పరిశీలించాల్సి ఉందని దువ్వూరి పేర్కొన్నారు. ఈ కంపెనీ కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందినది కావడమే దీనికి కారణం. ‘కుమార మంగళం బిర్లా గత ఆరేళ్లుగా ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డులో నామినేటెడ్ డెరైక్టర్‌గా ఉన్నారు. అందువల్ల ఆయన నేతృత్వంలోని కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తుపై ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుంది’ అని దువ్వూరి పేర్కొన్నారు. అయితే, ఇందులో ఎలాంటి వివాదానికీ తావుండదని ఆదిత్య బిర్లా నువో ఎండీ రాకేశ్ జైన్ చెప్పారు.
 
 రూపాయి భారీ హెచ్చుతగ్గులపై దృష్టి...: రూపాయి మారకం విలువను నిర్దిష్టంగా ఒక స్థాయి వద్దే ఉంచే లక్ష్యమేదీ ఆర్‌బీఐకి లేదని దువ్వూరి స్పష్టం చేశారు. తీవ్ర హెచ్చుతగ్గుల నివారణకు మాత్రం ప్రయత్నిస్తామన్నారు. ఇందుకు తమ వద్దనున్న అన్ని అస్త్రాలనూ ఉపయోగిస్తామన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ 60 దిగువకు పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టాలను తాకడం తెలిసిందే.
 
 బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాలి..: ఆర్‌బీఐ పాలసీ రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు అందించాలన్న చిదంబరం సూచనను దువ్వూరి సమర్థించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే అంశానికి ఆర్‌బీఐ కూడా చాలా ప్రాధాన్యమిస్తుందన్నారు. ‘పెట్టుబడులను ఆకర్షించాలంటే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గింపునకు అనుగుణంగా బ్యాంకులు కూడా తమ వడ్డీరేట్లను సమీక్షించుకోవాల్సిందే. అయితే, కొన్ని బ్యాంకులు రుణ రేట్లను తగ్గించగా, మరికొన్ని తగ్గించలేదు’ అని దువ్వూరి చెప్పారు.
 
 దువ్వూరి ఇంకా ఏం చెప్పారంటే...
 పోంజీ స్కీమ్‌లు: సామాన్య ప్రజలను తప్పుదోవపట్టిస్తూ నిధులను సమీకరించే మోసపూరిత(పోంజీ తదితర) స్కీమ్‌లకు అడ్డుకట్టవేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. మారుమూల పల్లెల్లో సైతం దేశవ్యాప్తంగా ఇలాంటి స్కీమ్‌లు ఉన్నాయి. వీటిపై ఆర్‌బీఐ కూడా దృష్టిపెడుతోంది. కేంద్రానికి, అదేవిధంగా నియంత్రణ సంస్థలకు ఇటువంటి సంస్థలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా వీటికి చెక్ చెప్పొచ్చని దువ్వూరి వ్యాఖ్యానించారు.
 
 ‘కోబ్రా పోస్ట్’పై: మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొన్ని బ్యాంకులపై కూడా ఆర్‌బీఐ త్వరలో చర్యలు తీసుకోనుందని చెప్పారు. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్‌పై రూ. 5 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రూ.4.5 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ. కోటి చొప్పున  జరిమానాలను ఆర్‌బీఐ విధించింది. కోబ్రాపోస్ట్ అనే వెబ్‌సైట్ తన స్టింగ్ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా 23 ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకులు, బీమా సంస్థలు నిబంధనలకు అతిక్రమిస్తున్నాయని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. 
 
 కాలినడకన తిరుమలకు దువ్వూరి
 తిరుమల, న్యూస్‌లైన్: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గురువారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. రాత్రి 9 గంటలకు అలిపిరి మార్గంలో బయలుదేరిన ఆయన చలిగాలుల మధ్య అర్ధరాత్రికి తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. 
  •  కొత్త బ్యాంకులపై ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి వ్యాఖ్యలు
  • లెసైన్స్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తాం...   
  •  దరఖాస్తుల మదింపునకు నాలుగు నెలలు పడుతుంది
  •  ‘బిర్లా’ దరఖాస్తుపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం...   
  •  రూపాయి మారకానికి నిర్దిష్ట లక్ష్యమేదీ లేదు
  •  తీవ్ర హెచ్చుతగ్గులు లేకుండా అన్ని అస్త్రాలూ ఉపయోగిస్తాం...   
  •  బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాల్సిందే
 
 
మరిన్ని వార్తలు