ఆర్‌బీఐ నుంచి రీ-షెడ్యూల్‌పై ఎటువంటి ఆదేశాలు రాలేదు..

25 Jul, 2014 00:59 IST|Sakshi
ఆర్‌బీఐ నుంచి రీ-షెడ్యూల్‌పై ఎటువంటి ఆదేశాలు రాలేదు..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ రుణాల రీ-షెడ్యూల్, మాఫీపై ఆర్‌బీఐ నుంచి ఇంత వరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలంగాణ రాష్ట్ర లీడ్ బ్యాంకరుగా ఉన్న  స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మేరకు వ్యవసాయ రుణ బకాయిల వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్‌బీహెచ్ ఎండీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన శంతను ముఖర్జీ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఐఐఈ నిర్వహించిన ‘ఆర్థిక సంస్కరణలు-పురోభివృద్ధి’ సదస్సులో ముఖర్జీ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీ, రీ-షెడ్యూల్ గురించి ఆర్‌బీఐ నుంచి ఎటువంటి సూచనలు రాలేదన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు రుణాలు చెల్లిం చడం లేదని, దీంతో ఎన్‌పీఏలు పెరుగుతున్నాయన్నా రు. 2 రోజుల్లో ఆర్థిక ఫలితాలు ప్రకటించనుండటంతో ఎన్‌పీఏల గురించి ఇప్పుడు చెప్పలేమని, ఒకసారి రుణ మాఫీ పథకంపై స్పష్టత వస్తే ఎన్‌పీఏలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణ మాఫీ కంటే కొత్త రుణాలను మంజూరు చేయడంపైనే దృష్టిసారించామని, ఇందుకు త్వరలోనే సీఎంతో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరపనున్నట్లు ముఖర్జీ తెలిపారు.

 ద్వితీయార్థం బాగు..: ప్రస్తుతం కార్పొరేట్ రుణాల డిమాండ్ స్థబ్తుగా ఉందని, ద్వితీయార్థం నుంచి వీటికి డిమాండ్ పెరుగుతుందనేది తమ అంచనా అన్నారు.  మౌలికరంగం పుంజుకుంటుందని భా విస్తున్నామని, కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. అనుబంధ బ్యాంకుల విలీనం అనేది ప్రభుత్వం, ఎస్‌బీఐ చేతుల్లో ఉందని.. దీనిపై తాము మాట్లాడటానికి ఏమీ లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

మరిన్ని వార్తలు