వ్యవసాయ రుణ మాఫీ మంచిది కాదు: వైవీ రెడ్డి

12 Dec, 2017 01:31 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థిక ప్రగతికి సరి కాదని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయ నిర్ణయాలు దీర్ఘకాలంలో సమర్ధనీయం కాదని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక రాష్ట్రంలో లేదా జాతీయ స్థాయిలోనో రుణాల మాఫీ హామీలు ఇస్తూనే ఉన్నాయని వైవీ రెడ్డి చెప్పారు. ‘ఆర్థిక ప్రగతికి గానీ రుణాల సంస్కృతికి గాని రుణ మాఫీ విధానాలు సరికావు.

దేశంలోని ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక రాష్ట్రంలోనో లేదా జాతీయ స్థాయిలోనో వ్యవసాయ రుణాల మాఫీ హామీలు ఇచ్చాయి. ఇది అంతిమంగా రాజకీయ అంశాలపరమైన నిర్ణయమే. దీర్ఘకాలంలో ఇది సమర్ధనీయం కాదు‘ అని ఇన్‌క్లూజివ్‌ ఫైనాన్స్‌ ఇండియా సదస్సు–2017లో పాల్గొన్న సందర్భంగా వైవీ రెడ్డి చెప్పారు. మరోవైపు, వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేసే బదులుగా వాటిని తిరిగి చెల్లించేందుకు మరింత అధిక వ్యవధినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ మరో మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. కావాలంటే ఓ ఏడాది వాయిదాలను, వడ్డీని మాఫీ చేయొచ్చని పేర్కొన్నారు. ఇవేవీ పనిచేయనప్పుడు మాత్రమే వ్యవసాయ రుణాల మాఫీపై దృష్టి పెట్టొచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు