టెలికం వృద్ధికి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడం

6 Jul, 2017 01:21 IST|Sakshi
టెలికం వృద్ధికి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడం

టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా
న్యూఢిల్లీ: టెలికం రంగ వృద్ధి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సంకోచించదని టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. తీవ్రమైన రుణ భారంతో సతమతమౌతోన్న టెలికం పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంజీ) తన నివేదిక రెండు వారాల్లోగా సమర్పించే అవకాశముందని చెప్పారు. ఈయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం మా వద్ద ఉంది. కేవలం ఒక వైపు అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం. ఐఎంజీ నివేదిక కోసం వేచి చూస్తున్నాం.

దేశంలో టెలికం పరిశ్రమకి సంబంధించిన విజయగాథ ఉంది. దీన్ని అలాగే కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం’ అని వివరించారు. అంతర మంత్రిత్వ శాఖ బృందం సిఫార్సులపై వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా టెలికం రంగ రుణం భారం రూ.4.6 లక్షల కోట్లను తాకిన విషయం తెలిసిందే. ఇక రిలయన్స్‌ జియో ఎంట్రీతో టెలికం కంపెనీల ఆదాయం, లాభదాయకతపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది.

మరిన్ని వార్తలు