నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ గాడిలోకి..

9 Nov, 2018 01:17 IST|Sakshi

పన్ను చెల్లింపులు విస్తృతమయ్యాయి

పెరిగిన ఆదాయం,  పన్ను రిటర్నులుపేదలు, మౌలిక  సదుపాయాలకు వీలు

డిజిటల్‌ చెల్లింపులు   బాగా పెరిగాయి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

పాత నోట్లు రద్దయి రెండేళ్లు పూర్తి  

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి బలంగా సమర్థించుకుంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత క్రమబద్ధమయిందని, పన్ను పరిధి విస్తృతమైందని, డిజిటైజేషన్‌కు సైతం దారితీసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. దీంతో పేదల ఆర్థిక స్థితుల్లో వృద్ధి, మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులను వినియోగించే అవకాశం ప్రభుత్వానికి లభించిందన్నారు. భారత్‌ వరుసగా ఐదో ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గుర్తింపును సొంతం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై విమర్శలు చేస్తున్న వారు తప్పని తేలిందన్నారు. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘డీమోనిటైజేషన్‌ ప్రభావం’ పేరుతో అరుణ్‌ జైట్లీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి నాలుగేళ్ల పాలనలో ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య... 2014 మేలో ఉన్న 3.8 కోట్ల నుంచి 80 శాతం పెరిగి 6.86 కోట్లకు చేరింది. మా ఐదేళ్ల పాలన ముగిసే నాటికి పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు అవుతుందనే నమ్మకం ఉంది. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ఆర్థిక రంగం మరింత క్రమబద్ధమయింది. ప్రభుత్వానికి మరింత ఆదాయం, మరిన్ని వనరులు అందుబాటులోకి వచ్చాయి. సాధించిన గొప్ప విజయాలు ఇవే. జీఎస్టీ అమలు చేయడంతో ఇప్పుడు పన్నుల ఎగవేత కూడా క్లిష్టతరంగా మారింది. జీడీపీలో పరోక్ష పన్నుల ఆదాయం జీఎస్టీకి ముందు 4.4 శాతంగా ఉంటే, అది ఆ తర్వాత 5.4 శాతానికి పెరిగింది’’ అని జైట్లీ వివరించారు. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో వ్యవస్థలో రూ.15.41 కోట్ల ధనం చలామణిలో ఉండగా, వీటిని రద్దు చేయడంతో, ఇందులో 99.3 శాతం అంటే రూ.15.31 లక్షల కోట్ల మేర బ్యాంకుల్లోకి వచ్చిన విషయం గమనార్హం. రూ.10,720 కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. దీంతో నల్లధనం నియంత్రణ కోసమంటూ కేంద్రం తీసుకున్న చర్యపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తాజాగా కూడా విమర్శలు చేసింది. ఈ విమర్శలపై జైట్లీ స్పందిస్తూ... ‘‘డీమోనిటైజేషన్‌తో మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. భారత్‌ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. డీమోనిటైజేషన్‌తో 2 శాతం వృద్ధి రేటు పడిపోతుందని అసత్యవాదులు చెప్పినవి తప్పని నిరూపించింది’’ అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ చర్యల తాలూకూ సానుకూల ప్రభావాలు రానున్న సంవత్సరాల్లో మరింత ప్రస్ఫుటిస్తాయని, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. 

మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి 
డీమోనిటైజేషన్‌తో వ్యవస్థలోని మొత్తం డబ్బంతా బ్యాంకుల్లోకి చేరిందన్న విమర్శలపై జైట్లీ స్పందిస్తూ... డబ్బును స్వాధీనం చేసుకోవడం డీమోనిటైజేషన్‌ ఉద్దేశం కాదన్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పన్నులు చెల్లించేలా చేయడమే ఉద్దేశాలుగా తెలిపారు. బ్యాంకుల్లో రద్దయిన పెద్ద నోట్ల జమతో, వారి తెలియని ఆదాయ వనరులను గుర్తించే అవకాశం ప్రభుత్వానికి లభించిందన్నారు. ఈ విషయంలో 17.42 లక్షల అనుమానాస్పద ఖాతాదారుల వివరణ సరిగా లేదని కూడా చెప్పారు. ‘‘బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాల్సి రావడంతో పన్ను రిటర్నులు దాఖలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 6.86 కోట్లకు చేరింది’’ అని వివరించారు. నగదు నుంచి డిజిటల్‌ లావాదేవీలకు మారడం కోసం వ్యవస్థలో కదలిక రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల అధిక పన్ను ఆదాయం, పన్ను చెల్లింపుదారులు పెరిగేందుకు దారితీస్తుందన్నారు. బ్యాంకుల్లో భారీ డిపాజిట్లతో వాటి రుణాలిచ్చే శక్తి ఇనుమడించిందని కూడా జైట్లీ చెప్పారు. చాలా డబ్బు మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర పెట్టుబడుల్లోకి మళ్లిందన్నారు. 2017–18లో పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారు 6.86 కోట్లు ఉన్నారని, అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువని తెలిపారు. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 5.99 కోట్లు  దాఖలయ్యాయని, 54 శాతం పెరుగుదల ఉందని చెప్పారాయన. 

రూపే, యూపీఐల జోరు 
అంతర్జాతీయ పేమెంట్‌ గేట్‌వేలు (చెల్లింపుల వ్యవస్థలు) అయిన మాస్టర్‌కార్డ్, వీసాలు మార్కెట్‌ వాటాను కోల్పోతున్నాయని అరుణ్‌ జైట్లీ చెప్పారు. దేశీయంగా రూపొందించుకున్న రూపే, యూపీఐ వ్యవస్థల ద్వారా జరిగే లావాదేవీలు... మొత్తం క్రెడిట్, డెబిట్‌ కార్డు లావాదేవీల్లో 65 శాతానికి చేరాయన్నారు. నోట్ల రద్దుతో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయన్నారు. రెండు మొబైల్‌ నంబర్ల మధ్య తక్షణమే నగదు బదిలీ కోసమని 2016లో యూపీఐని కేంద్రం తీసుకొచ్చింది. ‘‘2016 అక్టోబర్‌లో రూ.50 కోట్ల విలువైన లవాదేవీలు యూపీఐ ద్వారా జరిగితే, ఈ సెప్టెంబర్లో అవి రూ.59,800 కోట్లకు పెరిగాయి. భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (భీమ్‌) యాప్‌ను 1.25 కోట్ల మంది వినియోగిస్తున్నారు. భీమ్‌ యాప్‌ ద్వారా జరిగే లావాదేవీల విలువ ఈ రెండేళ్ల కాలంలో రూ.2 కోట్ల నుంచి రూ.7,060 కోట్లకు పెరిగింది. రూపే కార్డుల ద్వారా పీవోఎస్‌ మెషీన్ల వద్ద జరిపే లావాదేవీల విలువ డీమోనిటైజేషన్‌కు ముందు రూ.800 కోట్లు కాగా 2018 సెప్టెంబర్‌ నాటికి రూ.5,730 కోట్లకు పెరిగింది. ఈ కామర్స్‌ పోర్టళ్లలో లావాదేవీల విలువ రూ. 300 కోట్ల నుంచి రూ.2,700 కోట్లకు చేరింది’’ అని జైట్లీ గణాంకాలను ముందరపెట్టారు.  

 

మరిన్ని వార్తలు