రోజువారీ కార్మికులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం

30 Dec, 2017 10:48 IST|Sakshi

పెద్ద నోట్ల రద్దు.. నల్లధనంపై యుద్ధంలా ప్రకటించిన ఈ నిర్ణయం దీర్ఘకాలికంగా ప్రయోజనం ఇస్తుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటించినా.... మరోవైపు చిన్న కార్మికులు చితికిపోయారు. నోట్ల రద్దు తర్వాత చేపట్టిన ఎన్నో అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అంతేకాక ప్రభుత్వం  తాజాగా చేపట్టిన సొంత సర్వేలో కూడా ఈ విషయమే వెల్లడైంది. నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజువారీ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడంలో తీవ్ర ప్రతికూలం ఏర్పడిందని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ సొంత సర్వే ప్రకటించింది. అయితే సాధారణ ఉద్యోగాలు వృద్ధి చెందాయని లేబుర్‌ బ్యూరో నిర్వహించిన అధికారిక సర్వే తెలిపింది.

2017 జనవరి-మార్చి కాలంలో మొత్తం ఉద్యోగాల సృష్టి 1,85,000 ఉందని బ్యూరో ఐదవ క్వార్టర్లీ రిపోర్టు పేర్కొంది. తయారీ, నిర్మాణ, వాణిజ్యం, రవాణా, నివాసం, రెస్టారెంట్లు, ఐటీ, విద్య, ఆరోగ్యం వంటి ఎనిమిది రంగాల్లో లేబర్‌ బ్యూరో సర్వే చేపట్టింది. మొత్తం 81 శాతం ఉద్యోగాలు ఈ రంగాలే కల్పిస్తున్నాయి. అయితే జనవరి-మార్చి కాలంలో మాత్రం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 26వేలకు తగ్గారని, ముందటి క్వార్టర్‌లో ఈ సంఖ్య 1,24,000గా ఉందని తెలిపింది. అదేవిధంగా రోజువారీ కూలీ అందుకునే వర్కర్లు 2016-17 క్వార్టర్‌లో 53వేలకు పడిపోయారని పేర్కొంది. ముందటి క్వార్టర్‌లో ఈ ఉద్యోగులు కూడా 1,52,000గా ఉన్నారు. రెగ్యులర్‌ జాబ్స్‌ మాత్రం 1,97,000కు పెరిగినట్టు వెల్లడైంది. 

అధికారిక రంగంలో ఫుల్‌టైమ్‌ వర్కర్లకు వేతనాలు చెక్‌లు లేదా బ్యాంకు అకౌంట్లకు చెల్లిస్తారని, కానీ కాంట్రాక్ట్‌, రోజువారీ కూలీలకు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఐజీసీ ఇండియా సెంట్రల్‌ ప్రొగ్రామ్‌ దేశీయ డైరెక్టర్‌, గణాంకాల మాజీ అధికారి ప్రొనబ్‌ సేన్‌ తెలిపారు. కాంట్రాక్ట్‌ వర్కర్లలో తయారీ, వాణిజ్యం,ఐటీ రంగాల్లో ఉద్యోగాల సృష్టి తక్కువగా జరిగిందని, నిర్మాణం, రవాణా, విద్య, నివాసం రంగాల్లో ఉద్యోగాల కోత చూశామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఉద్యోగాల సృష్టి నెమ్మదించిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు