నోట్ల రద్దు దారుణం..

30 Nov, 2018 05:33 IST|Sakshi

ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌

దానివల్లే వృద్ధి మందగించింది

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం... ఆర్‌బీఐ వైఫల్యమే

మాజీ సీఈఏ అరవింద్‌ సుబ్రమణ్యన్‌ వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై కేంద్ర మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు దారుణమైన చర్యంటూ... ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని అరవింద్‌ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న ‘ఆఫ్‌ కౌన్సిల్‌ – ది చాలెంజెస్‌ ఆఫ్‌ మోదీ– జైట్లీ ఎకానమీ‘ పేరిట రాసిన పుస్తకంలో అరవింద్‌ ఈ అంశాలు ప్రస్తావించారు. పుస్తకంలో దీనికోసం ప్రత్యేకంగా టూ పజిల్స్‌ ఆఫ్‌ డీమానిటైజేషన్‌ – పొలిటికల్‌ అండ్‌ ఎకనమిక్‌’ అనే అధ్యాయాన్ని కేటాయించారు.


పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ముద్రించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్‌ 7న ముంబైలో, 9న ఢిల్లీలో ఆవిష్కరిస్తారు. నాలుగేళ్ల పాటు ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగి... ఇటీవలే అరవింద్‌ వైదొలిగారు. ‘నోట్ల రద్దు చాలా భారీ స్థాయి దారుణమైన చర్య. ద్రవ్య విధానానికి షాక్‌. ఒక్క దెబ్బతో చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించారు. డీమోనిటైజేషన్‌ కన్నా ముందు కూడా వృద్ధి రేటు నెమ్మదించింది! కానీ  పెద్ద నోట్ల రద్దుతో అమాంతంగా పడిపోయింది. డీమోనిటైజేషన్‌కు ఆరు త్రైమాసికాల ముందు వృద్ధి రేటు సగటున 8 శాతంగా ఉండగా.. పెద్ద నోట్ల రద్దు తరవాతి ఏడు త్రైమాసికాల్లో 6.8 శాతానికి పడిపోయింది‘ అని అరవింద్‌ వివరించారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

రాజకీయంగా అసాధారణం...
డీమోనిటైజేషన్‌ వల్ల వృద్ధి నెమ్మదించిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని.. కాకపోతే ఎంత స్థాయిలో మందగించిందన్నదే చర్చనీయమని అరవింద్‌ తన పుస్తకంలో తెలిపారు. రాజకీయ కోణంలో చూస్తే.. ఇటీవలి కాలంలో ఏ దేశం కూడా సాధారణ సందర్భాల్లో ఎకాయెకిన డీమోనిటైజేషన్‌ వంటి అసాధారణ చర్య తీసుకోలేదని స్పష్టంచేశారు. ‘‘సాధారణ పరిస్థితులున్నప్పుడు కరెన్సీని రద్దు చేయాల్సి వస్తే అది క్రమానుగతంగా మాత్రమే జరగాలి. అలాకాక యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం, రాజకీయ సంక్షోభం (2016లో వెనెజులా) వంటి పరిస్థితుల్లో మాత్రమే నోట్ల రద్దు వంటి అసాధారణ చర్యలు ఉంటాయి. భారత్‌లో ప్రయోగం మాత్రం ప్రత్యేకమైనది’’ అని అరవింద్‌ వివరించారు.

డీమోనిటైజేషన్‌ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజానీకానికి కష్టాలు ఎదురైనా, అక్రమార్కులు.. సంపన్నులు తమకన్నా ఎక్కువ నష్టపోతారన్న ఆలోచనతో వారు ఆ ఇబ్బందులను భరించడానికి సిద్ధపడ్డారన్నారు. ‘‘నాది ఒక మేకే పోయింది. కానీ వాళ్ల ఆవులన్నీ పోయాయి కదా! అనే భావనలో ఉంటారు. ఈ సందర్భంలోనూ అదే జరిగి ఉండొచ్చు. నిజానికి పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో సామాన్యులకు కొంత కష్టం తప్పకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో తప్పించేందుకు అవకాశం ఉండేది’’ అన్నారు.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌... నియంత్రణ సంస్థ వైఫల్యం..
నియంత్రణ సంస్థ వైఫల్యం వల్లే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తలెత్తిందని అరవింద్‌ సుబ్రమణ్యన్‌ అభిప్రాయపడ్డారు. దీనికి రిజర్వ్‌ బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గొప్ప సంస్థగా ఆర్‌బీఐకి మంచి పేరున్నప్పటికీ.. ప్రతీ సందర్భంలో అది సరైన నిర్ణయాలే తీసుకుంటోందనడానికి లేదని చెప్పారాయన. ‘‘రుణాల చెల్లింపు సమస్యలు, నీరవ్‌ మోదీ కుంభకోణాల్లాంటివాటి తీవ్రతను అది గ్రహించలేకపోయింది. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభాన్ని బట్టి ఆర్‌బీఐ వైఫల్యం వాణిజ్య బ్యాంకుల నియంత్రణకే పరిమితం కాలేదని, ఎన్‌బీఎఫ్‌సీల విషయంలోనూ అలాగే ఉందని అర్థమవుతోంది’’ అని తన పుస్తకంలో అరవింద్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ పర్యవేక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని, సమస్యల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చేందుకు తన వద్ద భారీగా ఉన్న నిల్వలను ఉపయోగించాలని సూచించారు.  

>
మరిన్ని వార్తలు