కోవిడ్‌-19- నోవావ్యాక్స్‌ 1000% జూమ్‌

27 May, 2020 13:35 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై ఆశలు

క్లినికల్‌ పరీక్షలలో ముందడుగు

ప్రొడక్టులు లేకున్నా షేరు గెలాప్‌

ఔషధ అభివృద్ధిపై పలు కంపెనీల దృష్టి

కోవిడ్‌-19 కట్టడికి అమెరికన్‌ బయోటెక్నాలజీ కంపెనీ నోవావ్యాక్స్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ పరీక్షలు విజయవంతమైనట్లు వెలువడిన వార్తలు మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. అంతేకాకుండా నోవావ్యాక్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెంచాయి. దీంతో ఈ షేరు 18 శాతం దూసుకెళ్లింది. తొలి దశలో భాగంగా ఆస్ట్రేలియాలో రెండు చోట్ల 130 మంది వొలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ పేర్కొంది. తొలి దశ సానుకూల ఫలితాలను ఇవ్వడంతో రెండో దశలో భాగంగా 18-59 ఏళ్ల మధ్య వ్యక్తులపై పరీక్షలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. 

2.7 బిలియన్‌ డాలర్లు
కరోనా వైరస్‌ కట్టడికి వీలుగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న నోవావ్యాక్స్‌ కౌంటర్‌ ఈ ఏడాది జనవరి నుంచీ బలపడుతూ వస్తోంది. వెరసి 1000 శాతం ర్యాలీ చేసింది. ఒక దశలో 61 డాలర్లను సైతం అధిగమించి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. తాజాగా 48 డాలర్ల వద్ద కదులుతోంది. ‍దీంతో కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ) 2.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఇంతవరకూ ఎలాంటి ప్రధాన ప్రొడక్టులనూ విక్రయించనప్పటికీ ఓస్లోకు చెందిన సంస్థ సీఈపీఐ నుంచి 38.8 కోట్ల డాలర్ల పెట్టుబడులను పొందడం గమనార్హం!

ఏడాది చివరికల్లా
ఏడాది చివరికల్లా అత్యయిక అధికారిక వినియోగం(ఈయూఏ) ద్వారా వ్యాక్సిన్‌కు అనుమతి పొందాలని ఆశిస్తున్నట్లు నోవావ్యాక్స్‌ తాజాగా పేర్కొంది. 10 కోట్ల డోసేజీల తయారీకి వీలుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. 

జాబితాలో
అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్‌ కట్టడికి 100 కంపెనీలు వ్యాక్సిన్ల తయారీలో బిజీగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలియజేసింది. ఈ బాటలో కోవిడ్‌-19 రోగులపై పరీక్షలు నిర్వహిస్తున్న 10 కంపెనీలలో నోవావ్యాక్స్‌కూ చోటు లభించినట్లు పేర్కొంది. ఔషధ తయారీకి ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌ ఇంక్‌, ఆస్ట్రాజెనెకా, మెర్క్‌ తదితర కంపెనీల సరసన మోడార్నా తదితర చిన్న, మధ్యస్థాయి కంపెనీలు సైతం చేరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు