భారత్‌కు క్యూ కట్టిన కార్ల దిగ్గజాల బాస్‌లు

12 Sep, 2014 00:23 IST|Sakshi
భారత్‌కు క్యూ కట్టిన కార్ల దిగ్గజాల బాస్‌లు

న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్, హోండా కంపెనీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారు. జనరల్ మోటార్స్ చైర్మన్ టిమ్ సోల్సో, హోండా మోటార్ కంపెనీ చైర్మన్ ఫుమిహికో ఐకెలు విడివిడిగా ప్రధానిని కలిశారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.

2020 కల్లా ప్రపంచంలో మూడో అతి పెద్ద వాహన మార్కెట్‌గా భారత్ అవతరించనున్నదనే అంచనాలున్నాయని, అందుకే పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయని నిపుణులంటున్నారు. అంతేకాకుండా భారత్ కేంద్రంగా కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పలు అంతర్జాతీయ వాహన దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు కంపెనీల చైర్మన్లు మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 40 కొత్త మోడళ్లు: జీఎం సీఈఓ మేరీ బర్రా
 జీఎం చైర్మన్ టిమ్ సోల్సోతో పాటు ఆ కంపెనీ సీఈఓ మేరీ బర్రా కూడా మోడీతో సమావేశమయ్యారు. ప్రధానిగా విజయం సాధించినందుకు అభినందనలు తెలపడానికి మోడీని కలిశామని వివరించారు. ఆ తర్వాత పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా ఆమె కలిశారు. కంపెనీ అంతర్జాతీయ టర్న్ అరౌండ్ ప్రణాళికల్లో భాగంగా ఆమె భారత్‌లో పర్యటిస్తున్నారు.

 డీలర్లు, వాహన విడిభాగాల సరఫరాదారులతో సమావేశమవుతారు.   భారత్‌తో సహా మొత్తం అంతర్జాతీయ మార్కెట్లలో 40 కొత్త మోడళ్లనందించనున్నామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఈ మోడళ్లను అందించే గడువును ఆమె వెల్లడించలేదు. 2020 కల్లా మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందనే అంచనాలున్నాయని, అందుకే భారత్ మార్కెట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఇక్కడ తీవ్రమైన పోటీ ఉందని, అందుకే మంచి వాహనాన్ని అందిస్తే తప్ప విజయం సాధించలేమని పేర్కొన్నారు. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన జనరల్ మోటార్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.2,740 కోట్ల నష్టాలను చవిచూసింది.

మరిన్ని వార్తలు