ఇప్పుడు స్పోర్టీ స్కూటర్ల వంతు 

1 Mar, 2018 00:45 IST|Sakshi
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తమ నూతన ఉత్పాదన టీవీఎస్‌ ఎన్‌టోర్క్‌ 125ని ఆవిష్కరిస్తున్న  సేల్స్‌ జనరల్‌ మేనేజర్లు బినయ్‌ ఆంథోని, ఆర్‌. బాలాజీ 

కుర్రకారు కోసం వినూత్న డిజైన్లు  

పోటీపడుతున్న ప్రధాన కంపెనీలు  

అమ్మకాల్లో ఏటా 35 శాతం వృద్ధి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహనాల్లో స్కూటర్లు సౌకర్యవంతంగా ఉంటాయన్నది వాస్తవం. ఇప్పుడు ఈ స్కూటర్‌ మార్కెట్‌ కాస్తా స్పోర్టీ, స్మార్ట్‌ వైపు దూసుకెళ్తోంది. సాధారణ స్కూటర్లతో పోలిస్తే ఈ స్పోర్టీ వేరియంట్ల అమ్మకాలు రెండింతల మేర వృద్ధి చెందుతున్నాయంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మెట్రోలు, పెద్ద పట్టణాలే కాకుండా చిన్న పట్టణాల్లోనూ యువత వీటికి దాసోహం అంటున్నారు. అటు తయారీ కంపెనీలు సైతం వినూత్న డిజైన్లతో ఒకదాని వెంట ఒకటి పోటీపడుతున్నాయి. ఈ ఏడాది మరిన్ని మోడళ్లు కస్టమర్ల కోసం రెడీ అవుతున్నాయి. 

స్పోర్టీ మోడళ్లకు సై.. 
విభిన్న డిజైన్లు, మల్టీ కలర్, స్పోర్టీ లుక్‌ స్కూటర్లకు యువత సై అంటున్నారు. స్కూటర్ల విభాగం ఏటా 18 శాతం వృద్ధి చెందితే, స్పోర్టీ మోడళ్లు 35 శాతం వృద్ధి నమోదవుతున్నాయని టీవీఎస్‌ సేల్స్‌ జీఎం బినయ్‌ ఆంథోని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘స్కూటర్లలో స్పోర్టీ మోడళ్ల వాటా 10 శాతం దాకా ఉంది. 18 నుంచి 24 ఏళ్ల కుర్రకారే ఈ విభాగాన్ని నడిపిస్తున్నారు’’ అని ఆథోని వివరించారు. ద్విచక్ర వాహన రంగంలో అధిక మైలేజీ ఇచ్చే ఇంజన్ల అభివృద్ధికి కంపెనీలు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఒకప్పుడు మైలేజీ లీటరు పెట్రోలుకు 30 లోపే ఉండేది. ఇప్పుడు 55 కిలోమీటర్ల దాకా ఇచ్చే మోడళ్లూ వచ్చాయి. బైక్‌ల మైలేజీ కూడా ఇదే స్థాయిలో ఉండటంతో స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.   

పోటాపోటీగా మోడళ్లు.. 
ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు పోటాపోటీగా స్పోర్టీ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. హోండా నుంచి గ్రేజియా, డియో. హీరో మోటోకార్ప్‌ నుంచి మాయెస్ట్రో ఎడ్జ్‌. యమహా నుంచి రే–జడ్‌ఆర్, రే–జడ్, ఆల్ఫా. అప్రీలియా నుంచి ఎస్‌ఆర్‌ 150 రేస్, ఎస్‌ఆర్‌ 150 వంటివి ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహీంద్రా తన గస్టో మోడల్‌ను స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్దింది. వీటికి పోటీ ఇచ్చేందుకు తాజాగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఎన్‌టార్క్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇతర కంపెనీలకు భిన్నంగా కనెక్టెడ్‌ స్కూటర్‌గా దీనిని అభివర్ణిస్తోంది. సుజుకీ ఈ ఏడాదే బ్రౌనీ 125, బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ 125 మోడల్స్‌ను తీసుకొస్తోంది. ఇక కంపెనీలన్నీ రెగ్యులర్‌ మోడళ్లను సైతం మల్టీ కలర్, స్పోర్టీ లుక్‌ వచ్చే విధంగా రీలాంచ్‌ చేస్తుండటం ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పడుతోంది. 

మూడింట ఒకటి స్కూటర్‌.. 
దేశవ్యాప్తంగా 2016–17లో 1.75 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం నెలకు అమ్ముడవుతున్న యూనిట్లలో 34 శాతం వాటా స్కూటర్లు చేజిక్కించుకున్నాయి. అంటే మూడు వాహనాల్లో ఒకటి స్కూటర్‌ అన్నమాట. గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడం, స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా వాహన డిజైన్‌ ఉండటం, సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ అనుభూతి వంటి కారణాలతో స్కూటర్లు పాపులర్‌ అవుతున్నాయి. స్కూటర్ల విభాగం అయిదేళ్లుగా ఏటా 18 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. 2012–13లో దేశీయంగా 1.38 కోట్ల యూనిట్ల టూవీలర్లు విక్రయమయ్యాయి. ఇందులో స్కూటర్ల వాటా 20 శాతం లోపే ఉంది. కాగా, భారత్‌లో ఈ ఏడాది అన్ని కంపెనీల నుంచి 150 సీసీ స్కూటర్లు మార్కెట్లో అడుగు పెడతాయని సమాచారం.  

మరిన్ని వార్తలు