ఇప్పుడు 4జీ మొబైల్స్ వంతు..

17 Aug, 2015 23:45 IST|Sakshi
ఇప్పుడు 4జీ మొబైల్స్ వంతు..

- రూ.5 వేల ధరలో మార్కెట్లోకి
- వేడెక్కుతున్న స్మార్ట్‌ఫోన్ల రంగం
- కీలకంగా మారిన భారత్ విపణి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
2జీ, 3జీ.. ఇప్పుడు 4జీ. దిగొస్తున్న టెక్నాలజీ వ్యయం పుణ్యమాని స్మార్ట్‌ఫోన్ల విపణి హాట్  హాట్‌గా మారుతోంది. 3జీ ఫోన్లు పూర్తి స్థాయిలో కస్టమర్ల చేతుల్లోకి ఇంకా రాలేదు. అప్పుడే 4జీ మోడళ్ల హవా నడుస్తోంది. ఏప్రిల్-జూన్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లలో 58 శాతం 4జీ మోడళ్లు కైవసం చేసుకున్నాయి. అంతేకాదు కంపెనీల ధరల యుద్ధం 4జీ ఫోన్లకూ పాకింది. పోటాపోటీగా అందుబాటు ధరలో మోడళ్లను తీసుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఒక అడుగు ముందుకేసి రూ.5 వేల ధరకే ఫోన్లను ప్రవేశపెట్టాయి. మరిన్ని కంపెనీలు వీటి సరసన చేరనున్నాయి.
 
భారత్‌కూ పాకిన వేడి..
మొబైల్ ఫోన్ రంగం భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక ఫీచర్లకుతోడు ఔరా అనిపించే ధరలో వస్తున్న మోడళ్లతో పరిశ్రమ రోజుకో మలుపు తిప్పుతోంది. కొత్త బ్రాండ్లు ఎన్ని వచ్చినా మార్కెట్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ బూమ్ పుణ్యమాని ఇప్పుడు సామాజిక మాధ్యమాల హవా నడుస్తోంది. ఈ మాధ్యమాలే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలకు ప్రాణం పోస్తున్నాయి. వెరశి మొబైల్ ఫోన్ రంగంలో స్మార్ట్‌ఫోన్ల శకం నడుస్తోంది.

భారత మొబైల్ ఫోన్ పరిశ్రమలో స్మార్ట్‌ఫోన్ల వాటా ఏడాదిలో 10 శాతం పెరిగిందంటే ఇక్కడి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. 2015లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ విక్రయాల  వృద్ధిలో భారత మార్కెట్‌దే ప్రధాన పాత్ర అని జీఎఫ్‌కే డెరైక్టర్ కెవిన్ వాల్ష్ వెల్లడించారు. 2016లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఫీచర్ ఫోన్లను మించిపోతుందని దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్ స్పష్టం చేస్తోంది.
 
50 శాతం రూ.6 వేల లోపువే..
భారత స్మార్ట్‌ఫోన్ల విపణి 2017 నాటికి అమెరికాను మించిపోయి రెండో స్థానానికి చేరుతుందన్న అంచనాలున్నాయి. అందుకే విదేశీ కంపెనీలు సైతం ఇప్పుడు భారత్‌పై ఫోకస్ చేశాయి. చైనాలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రూ.6 వేల లోపు మోడళ్ల వాటా 20 శాతం ఉంది. భారత్‌లో వీటి వాటా ఏకంగా 50 శాతముందని ఐడీసీ చెబుతోంది. దేశ, విదేశీ సంస్థలు 4జీ మోడళ్లను రూ.5 వేల ధరలో తీసుకొచ్చే పనిలో ఉన్నాయి.

చైనా కంపెనీ ఫికామ్ రూ.4,999లకే ఎనర్జీ 653 మోడల్‌ను అమెజాన్ ద్వారా విక్రయిస్తోంది. లెనోవో ఏ2010 మోడల్‌ను ఇంత కంటే తక్కువ ధరలో భారత్‌లో ఆవిష్కరించనుంది. వియత్నాంలో ఈ మోడల్‌ను లెనోవో రూ.4,970లకి విక్రయిస్తోంది. సెప్టెంబర్‌లో రూ.5 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు సెల్‌కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.

‘స్మార్ట్’గా అడుగులు..
ప్రస్తుతం భారత మొబైల్ ఫోన్ మార్కెట్లో పరిమాణం పరంగా ఫీచర్ ఫోన్లు 55 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. స్మార్ట్‌ఫోన్లు 45 శాతం ఉన్నాయి. 2014లో స్మార్ట్‌ఫోన్ల వాటా 35 శాతం మాత్రమే. 2016లో ఈ విభాగం ఫీచర్ ఫోన్లను మించిపోనుంది. ఫీచర్ ఫోన్ వినియోగదార్లు కాస్తా ‘స్మార్ట్’గా మారిపోతున్నారు. సామాజిక మాధ్యమాలకు స్మార్ట్‌ఫోన్ కస్టమర్లు అధిక సమయం వెచ్చిస్తున్నారు.

సగటున రోజుకు 150-160 నిముషాలు స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. గేమ్స్ కోసం నెలకు 6 నుంచి 8.5 గంటలు వెచ్చిస్తున్నారు. కొత్తవారు సైతం వీటికి ఆసక్తి కనబరుస్తున్నారు. అటు టెలికం కంపెనీలు అందుబాటు ధరలో ప్యాక్‌లను అందిస్తున్నాయి. వెరశి ఏడాదిలో పరిమాణం పరంగా స్మార్ట్‌ఫోన్లు తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని శామ్‌సంగ్ మొబైల్ బిజినెస్ డెరైక్టర్ మను శర్మ తెలిపారు. కాగా, విలువ పరంగా చూస్తే స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం 85 శాతం వాటాను దక్కించుకున్నాయి.
 
ఏడాదిన్నరకే..
దేశంలో 2015 ఏప్రిల్-జూన్ కాలంలో భారత్‌కు 5.94 కోట్ల యూనిట్ల ఫోన్లు దిగుమతయ్యాయి. వీటిలో ఫీచర్ ఫోన్లు 3.29 కోట్లు, స్మార్ట్‌ఫోన్లు 2.65 కోట్ల యూనిట్లు. ఫీచర్ ఫోన్ల వృద్ధి క్రమంగా తగ్గుతోంది. మార్కెట్ అంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లదే. 2014 జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల విపణి 44 శాతం వృద్ధి నమోదైందంటే మార్కెట్ తీరును అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఇప్పుడు 55 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదార్లున్నారని కంపెనీలంటున్నాయి. వీరు క్రమంగా స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని వై.గురు తెలిపారు. ఇక గతంలో మూడేళ్లు అట్టిపెట్టుకున్న వారు ఇప్పుడు ఏడాదిన్నరకే స్మార్ట్‌ఫోన్‌ను మారుస్తున్నారని సామ్‌సంగ్ అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆపిల్ ఐఫోన్-6, శామ్‌సంగ్-ఎస్6 ఎడ్జ్ వంటి ఖరీదైన మోడళ్లను వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు