ఎన్‌పీఏ రికవరీ రూ.1.80 లక్షల కోట్లు! 

21 Feb, 2019 01:14 IST|Sakshi

2018–19పై కేంద్రం అంచనా

న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్‌పీఏ) రికవరీ విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1.80 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఆర్థికశాఖ అంచనావేస్తోంది. రెండు బడా ఎన్‌పీఏ కేసుల పరిష్కారం తుది దశలో ఉండటం దీనికి కారణమని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. దివాలా కోడ్‌ (ఐబీసీ) కింద ఇప్పటికే బ్యాంకులు లక్ష కోట్ల రూపాయలు రికవరీ చేశాయి. మరికొన్ని కేసుల పరిష్కారం తుదిదశలో ఉన్నట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.  ఎస్సార్‌ స్టీల్‌ కేసులో రూ.52,000 కోట్లు, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ నుంచి మరో రూ.18,000 కోట్లు రికవరీ అవుతాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు వీడియోకాన్‌ గ్రూప్, మానెట్‌ ఇస్పాత్, ఆమ్టెక్‌ ఆటో, రుచీ సుయాలకు సంబంధించి కూడా దివాలా వివాదాలు కూడా త్వరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2016లో దివాలా కోడ్‌ అమల్లోకి వచ్చాక దాదాపు రూ.3 లక్షల కోట్ల విలువైన ఇబ్బందికర బకాయిలు పరిష్కారం అయినట్లు  అంచనా. ఆయా అంశాలన్నీ బ్యాంకులకు సానుకూలమని రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.9.62 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు అటు తర్వాత రూ.23,000 కోట్లకు తగ్గాయి. 

మరిన్ని వార్తలు