ఎన్‌పీఏ సమస్య సత్వర పరిష్కారం కష్టమే!!

26 Jun, 2018 00:31 IST|Sakshi

బజాజ్‌ ఆటో చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం అందుబాటులో ఉన్నప్పటికీ ఇండియన్‌ బ్యాంకులు అతిపెద్ద మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యకు త్వరితగతిన పరిష్కారాన్ని చూడలేవని బజాజ్‌ ఆటో చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ తెలిపారు. దేశం పెట్టుబడుల కొరతను  ఎదుర్కొంటోందని, జీడీపీలో ప్రస్తుత స్థూల పెట్టుబడుల వాటా 7.5–8 శాతం స్థిర వృద్ధికి సరిపోదని పేర్కొన్నారు. ఈయన 2017–18 వార్షిక నివేదికలో సంస్థ వాటాదారులకు రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు. ఇన్వెస్ట్‌మెంట్ల కొరత, బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి అనే రెండు ప్రధాన అంశాల కారణంగా దేశ జీడీపీ వృద్ధి నెమ్మదించిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వార్షిక ప్రాతిపదికన 2017–18 ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో (6.7 శాతం) వృద్ధి చెందింది.

2016–17 ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.1 శాతం. 2013–14లో వృద్ధి కనిష్టంగా 6.4 శాతంగా నమోదయ్యింది. కొండలా భారీగా పేరుకుపోయిన ఎన్‌పీఏలు బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లను నాశనం చేశాయని, లాభాలను హరించేశాయని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. దీనివల్ల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త దివాలా చట్టం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనివల్ల ఎన్‌పీఏల సమస్య సత్వర పరిష్కారాన్ని చూడలేదని తెలిపారు. జీడీపీపై పెట్టుబడుల కొరత ప్రభావాన్ని వివరిస్తూ.. ‘జీడీపీలో స్థూల స్థిర పెట్టుబడుల వాటా గత ఆరేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 7.5–8 శాతం స్థిర వృద్ధికి ఇది సరిపోదు’ అని పేర్కొన్నారు. దేశీ మోటార్‌సైకిల్‌ విక్రయాల తగ్గుదల సంస్థపై ప్రభావం చూపదని, మరింత మంచి పనితీరును ప్రదర్శిస్తుందని రాహుల్‌ బజాజ్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు