ఇక అర్ధరాత్రి వరకు ట్రేడింగ్‌...!

26 Jul, 2018 01:11 IST|Sakshi

ట్రేడింగ్‌ వేళల పొడిగింపునకు  ఎన్‌ఎస్‌ఈ దరఖాస్తు 

ముంబై: ఈక్విటీ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ను అర్ధరాత్రి వరకు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎన్‌ఎస్‌ఈ సెబీకి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం డెరివేటివ్‌లలో ట్రేడింగ్‌ స్పాట్‌ మార్కెట్‌తో సమానంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తోంది. అయితే, సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 11.55 మధ్య రెండో సెషన్‌ నిర్వహించాలన్నది ఎన్‌ఎస్‌ఈ యోచన. మరి రెండో సెషన్‌లో కేవలం ఇండెక్స్‌ డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ మాత్రమే ఉంటుందా లేక స్టాక్‌ డెరివేటివ్‌లు ఉంటాయా అన్న దానిపై స్పష్టత లేదు.

ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 11.55 వరకు డెరివేటివ్‌ ట్రేడింగ్‌ నిర్వహించేందుకు సెబీ ఈ ఏడాది మే నెలలోనే సమ్మతి తెలియజేసింది. దేశీయంగా డెరివేటివ్స్‌ మార్కెట్లో 90% వాటా ఎన్‌ఎస్‌ఈ చేతిలోనే ఉండడంతో ఈ సంస్థ తొలుత ఈ దిశగా అడుగు వేయడం గమనార్హం. మరో ప్రధాన ఎక్సే్చంజ్‌ బీఎస్‌ఈ నిర్ణయం ఏంటన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ప్రస్తుతానికి కమోడిటీ ఎక్సే్చంజ్‌లు మాత్రమే అర్ధరాత్రి వరకు ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నాయి. అయితే, ఈక్విడీ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకు పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తామని... అదనపు వేళల కారణంగా అయ్యే ఖర్చులను సర్దుబాటు చేసుకునేంత వ్యాపారం ఉండదని బ్రోకర్లు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు