మార్కెట్లో నవ్యోత్సాహం

11 Jul, 2017 01:37 IST|Sakshi
మార్కెట్లో నవ్యోత్సాహం

సరికొత్త రికార్డులకు సూచీలు
ఎన్‌ఎస్‌ఈలో అవాంతరాలు ఎదురైనప్పటికీ బుల్స్‌జోరు  
105 పాయిట్ల లాభంతో 9,771 వద్ద ముగిసిన నిఫ్టీ
సెన్సెక్స్‌ 355 పాయింట్లు అప్‌... 31,715 వద్ద క్లోజ్‌


ముంబై:  దేశ స్టాక్స్‌ మార్కెట్లలో సోమవారం మరోసారి నూతన రికార్డులు నమోదయ్యాయి. కొనుగోళ్ల సందడితో సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో క్లోజయ్యాయి. ఎన్‌ఎస్‌ ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎదురైన అవాంతరాలు బుల్స్‌ జోరుకు అడ్డుపడలేదు. బీఎస్‌ఈ ఏకంగా 355 పాయింట్లు లాభపడి 31,715.64 వద్ద క్లోజయింది. జూలై 6 నాటి 31,369.34 పాయింట్ల స్థాయిని అధిగమించి నూతన గరిష్ట స్థాయిల్లో స్థిరపడింది. ఇంట్రాడేలో 31,768 ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 105.25 పాయింట్ల లాభంతో 9,771.05 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 9,782.20 పాయింట్ల వరకు వెళ్లి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి నమోదు చేసింది.

ఈ ఏడాది మే 25 తర్వాత సూచీలు ఒకే రోజు ఈ స్థాయిలో లాభపడటం మళ్లీ ఇదే. ఇన్వెస్టర్ల సంపద 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. రోజంతా సూచీలు లాభాల్లోనే ట్రేడవడం మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఆర్థిక ఫలితాలపై నెలకొన్న ఆశావహ పరిస్థితికితోడు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం లాభాలకు కారణమని బ్రోకర్లు పేర్కొన్నారు. ఈ నెల 13న టీసీఎస్‌ ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే.

స్టాక్స్‌ ర్యాలీ: సూచీల్లోని స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా 5.39 శాతం లాభపడింది. ఆ తర్వాత టీసీఎస్, విప్రో సైతం 5 శాతం వరకు లాభపడ్డాయి.   నష్టపోయిన షేర్లలో ఎంఅండ్‌ఎం, ఐటీసీ ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్స్‌ షేరు ఇంట్రాడేలో మెరుపులు మెరిపించింది. యూఎస్‌ఎఫ్‌డీఏ విశాఖపట్నం యూనిట్‌పై జారీ చేసిన దిగుమతుల అలర్ట్‌ను ఎత్తేసిందని కంపెనీ ప్రకటించడంతో 20 శాతం వరకు పెరిగి బీఎస్‌ఈలో రూ.816.15 స్థాయిని చేరింది. ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడితో చివరికి 8 శాతం లాభానికి పరిమితమై రూ.734.15 వద్ద ముగిసింది. ఐడీఎఫ్‌సీ, శ్రీరామ్‌ గ్రూపు విలీనం వార్తల నేపథ్యంలో ఈ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు