భళా.. 11,000 మార్క్‌ దాటిన నిఫ్టీ

20 Jul, 2020 15:52 IST|Sakshi

121 పాయింట్లు ప్లస్‌

11,022 వద్ద నిలిచిన నిఫ్టీ

సెన్సెక్స్‌ 399 పాయింట్లు అప్‌

37,419 వద్ద ముగింపు

ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల దన్ను

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్నప్పటికీ వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు రోజంతా హుషారుగా కదిలాయి. వెరసి నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 121 పాయింట్లు జమ చేసుకుని 11,022 వద్ద స్థిరపడింది. ఇక సెన్సెక్స్‌ సైతం 399 పాయింట్లు జంప్‌చేసి 37,419 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,038 వద్ద గరిష్టాన్ని తాకగా.. 10,953 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. సెన్సెక్స్‌ 37,479-37,186 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

ఫార్మా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా(1.6 శాతం) మాత్రమే వెనకడుగు వేయగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఐటీ 2.6 శాతం పుంజుకోగా.. బ్యాంక్‌ నిఫ్టీ 1.6 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా, విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే సన్‌ ఫార్మా, సిప్లా, జీ, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, మారుతీ, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో 4-0.8 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ జోరు
డెరివేటివ్స్‌లో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 10 శాతం దూసుకెళ్లగా.. అదానీ ఎంటర్‌, నౌకరీ, ఈక్విటాస్‌, చోళమండలం 6.5-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. లుపిన్‌, ఎస్‌బీఐ లైఫ్‌, నాల్కొ, గ్లెన్‌మార్క్, ఇండిగో, బీఈఎల్‌ 3.4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1520 లాభపడితే.. 1167 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 697 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 209 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1091 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  డీఐఐలు రూ. 1660 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు