బ్యాంకుల చేతికి 9 విద్యుత్‌ ప్లాంట్లు!

4 Jul, 2017 00:41 IST|Sakshi
బ్యాంకుల చేతికి 9 విద్యుత్‌ ప్లాంట్లు!

మొండిబకాయిలుగా మారిన థర్మల్‌ ప్రాజెక్టుల టేకోవర్‌కు సన్నాహాలు
నిర్వహణ ఎన్‌టీపీసీకి అప్పగించే అవకాశం...
జాబితాలో ల్యాంకో ఇన్‌ఫ్రా బాబంధ్‌ ప్రాజెక్టు కూడా...


న్యూఢిల్లీ: మొండిబకాయిల వసూళ్లపై తీవ్రంగా దృష్టిపెట్టిన బ్యాంకులు... విద్యుత్‌ రంగ ప్రాజెక్టులను దక్కించుకునే పనిలోపడ్డాయి. ప్రధానంగా తమకు రావలసిన బకాయిల మొత్తానికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల్లో వాటాను టేకోవర్‌ చేసుకునేందుకు చకచకా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 9 థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఎన్‌పీఏ సమస్య పరిష్కారానికి తాజాగా ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారీగా రుణాలను ఎగవేసిన సుమారు 12 కంపెనీలపై దివాలా చట్టాన్ని ప్రయోగించాలని కూడా ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించడం... ఆ మేరకు కొన్ని కంపెనీలపై బ్యాంకులు చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది.

ప్రస్తుతం దేశంలో పేరుకుపోయిన ఎన్‌పీఏల్లో ఈ 12 ఖాతాలకు సంబంధించినవే 25 శాతం(దాదాపు రూ.2 లక్షల కోట్లు) కావడం గమనార్హం.బ్యాంకులు షార్ట్‌లిస్ట్‌ చేసిన తొమ్మిది ప్రాజెక్టుల్లో జిందాల్‌ ఇండియా థర్మల్‌ పవర్‌(జేఐటీపీఎల్‌)కు చెందిన డేరంగ్‌ ప్రాజెక్టు(ఒడిశాలో ఉంది. దీని సామర్థ్యం 1,200 మెగావాట్లు), రాటన్‌ఇండియా పవర్‌ ప్లాంట్‌(మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంది. సామర్థ్యం 1,350 మెగావాట్లు), లాంకో ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన బాబంధ్‌(ఒడిశా, 1,320 మెగావాట్లు) ప్రధానమైనవని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈ 9 ప్రాజెక్టుల మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం సుమారు 25 వేల మెగావాట్లుగా అంచనా. రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం నిర్ధేశించడంతో మంత్రిత్వ శాఖలు కూడా దీనిపై దృష్టిపెడుతున్నాయి. ఎన్‌పీఏలుగా మారిన విద్యుత్‌ ప్రాజెక్టుల టేకోవర్‌కు బ్యాంకులు అంగీకరించినట్లు విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఇటీవలే వెల్లడించారు.

ప్రాజెక్టులన్నీ చిక్కుల్లోనే...
వాటా తీసుకోవడం కోసం బ్యాంకులు చురుగ్గా పరిశీలిస్తున్న మూడు ప్రధాన పవర్‌ ప్లాంట్లను విక్రయించేందుకు ఏడాదిగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... ఎవరూ ముందుకురాలేదు. జేఐటీపీఎల్‌ డేరంగ్‌ ప్లాంట్, ల్యాంకో ఇన్‌ఫ్రా బాబంధ్‌ ప్లాంట్లు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటికి కేటాయించిన బొగ్గు గనులు బొగ్గు స్కామ్‌లో చిక్కుకోవడంతో 2014లో సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఇంధన సరఫరా సమస్యల్లో చిక్కుకున్నాయి. ఇక రాటన్‌ఇండియా నాసిక్‌ యూనిట్‌ విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు లేక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇక రాటన్‌ ఇండియా నాసిక్‌ యూనిట్‌ 2016–17లో రూ.215 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాజెక్టులను నడిపించేందుకు కంపెనీలు సిద్ధంగానే ఉన్నప్పటికీ.. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ పంపిణీ కంపెనీలేవీ అదనంగా విద్యుత్‌ కొనుగోళ్లకు టెండర్లను నిర్వహించకపోవడంతో సమస్యలు తీవ్రతరమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క, ఎన్‌పీఏలపై బ్యాంకుల నుంచి ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. విద్యుత్‌కు డిమాండ్‌ మందగించడంతో చాలా ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతోందని.. 2022 వరకూ ఈ రంగంలో కొత్తగా ప్రైవేటు పెట్టుబడులు ఉండకపోవచ్చనేది విద్యుత్‌ రంగ నిపుణుల అభిప్రాయం.

రంగంలోకి ఎన్‌టీపీసీ...!
బ్యాంకులు చేజిక్కించుకునే థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్వహణను ప్రభుత్వరంగంలోని ఎన్‌టీపీసీకి అప్పగించేందుకు విద్యుత్‌ శాఖ కూడా సుముఖంగానే ఉంది. ఈ విషయాన్ని గోయల్‌ కూడా వెల్లడించారు. అయితే, ఈ ప్లాంట్లలో ఎన్‌టీపీసీ   పెట్టుబడులు పెట్టే అవకాశం లేదని..  నిర్వహణకు మాత్రమే పరిమితమవుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క, ఈ ప్రాజెక్టుల్లో కొంత ఈక్విటీ వాటాను తీసుకునే అవకాశాన్ని ఎన్‌టీపీ పరిశీలిస్తున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. ‘ఈ ప్లాంట్ల కార్యకలాపాలను నిర్వహించేందుకు తాము బ్యాంకుల నుంచి కొంత ఫీజును తీసుకుంటాం ఒకవేళ వీటిలో 3–4 శాతం వాటా గనుక బ్యాంకులు తమకు ఇస్తే... ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉండదు’ అని ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు