సౌర విద్యుత్‌పై ఎన్టీపీసీ దృష్టి

26 Dec, 2019 04:14 IST|Sakshi

రూ. 50,000 కోట్ల పెట్టుబడి

2022 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యం పెంపు లక్ష్యం...

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ 2022 నాటికి మరో 10 గిగావాట్ల మేర సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 50,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. గ్రీన్‌ బాండ్స్‌ ద్వారా ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌర విద్యుత్‌ సహా ఎన్‌టీపీసీ పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం 920 మె.వా.గా ఉంది. 2032 నాటికి 130 గి.వా. కంపెనీగా ఎదగాలని ఎన్‌టీపీసీ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 30 శాతం వాటా పునరుత్పాదక విద్యుత్‌దే ఉండనుంది.

 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2,300 మె.వా. సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 2020–21, 2021–22 మధ్య ఏటా 4 గి.వా. మేర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోనున్నట్లు వివరించాయి. 2022కల్లా పర్యావరణహిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 175 గి.వా.కు పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఎన్‌టీపీసీ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు