ఎన్‌టీపీసీకి వ్యయాల షాక్‌

9 Feb, 2017 00:37 IST|Sakshi
ఎన్‌టీపీసీకి వ్యయాల షాక్‌

8 శాతం తగ్గిన లాభం
ఒక్కో షేర్‌కు రూ.2.61 డివిడెండ్‌


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కంపెనీ, ఎన్‌టీపీసీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్లో 8 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.2,669 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.2,469 కోట్లకు తగ్గిందని ఎన్‌టీపీసీ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండడం వల్ల నికర లాభం క్షీణించిందని వివరించింది. ఒక్కో షేర్‌కు రూ.2.61(26.10 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని.  ఈ నెల 22న డివిడెండ్‌ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది.  గత క్యూ3లో రూ.10,580 కోట్లుగా ఉన్న ఇంధన వ్యయాలు ఈ క్యూ3లో రూ.12,080 కోట్లకు ఎగిశాయని తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.19,646 కోట్లు
విద్యుదుత్పత్తి ద్వారా ఆర్జించిన ఆదాయం రూ.17,524 కోట్ల నుంచి రూ.19,556 కోట్లకు ఎగసిందని వివరించింది. ఇక మొత్తం ఆదాయం రూ.17,725 కోట్ల నుంచి రూ.19,646 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సంబంధించిన ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) 78.23 శాతం నుంచి 77.21 శాతానికి తగ్గిపోయిందని వివరించింది.  ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి సగటు టారిఫ్‌ ఒక్కో యూనిట్‌కు 3.28గా ఉందని తెలిపింది. గత క్యూ3లో 45,548 మెగావాట్లుగా ఉన్న తమ గ్రూప్‌ వ్యవస్థాపక విద్యుదుత్పత్తి సామర్థ్యం ఈ క్యూ3లో 48,028  మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది.

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎన్‌టీపీసీ షేర్‌ 0.70 శాతం క్షీణించి రూ.172 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు