రూ.100 కోట్లతో ఓ2 స్పా విస్తరణ!

22 Sep, 2016 00:55 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రితేష్ రెడ్డి, స్వప్న రెడ్డి

బనియన్ ట్రీ నుంచి రూ.73.7 కోట్ల పీఈ నిధులు
ఈ ఏడాదిలో 30 నగరాల్లో 150 సెంటర్ల ఏర్పాటు
త్వరలోనే విజయవాడలో తొలి ఔట్‌లెట్ ఏర్పాటు
ఓ2 స్పా ఫౌండర్, ఎండీ రితేష్ రెడ్డి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద డే స్పా సేవలందిస్తున్న ‘ఓ2 స్పా’ భారీ స్థాయిలో విస్తరణకు సిద్ధమైంది. ఈ ఏడాది ముగిసే నాటికి రూ.100.5 కోట్ల (15 మిలియన్ డాలర్లు) పెట్టుబడులతో దేశంలోని 30 నగరాల్లో 150 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘‘విస్తరణ నిమిత్తం తొలిసారిగా నిధులు సమీకరించాం. మారిషస్‌కు చెందిన బనియన్ ట్రీ నుంచి రూ.73.7 కోట్లు (11 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు సమీకరించాం. మిగిలినవి వ్యక్తిగత పెట్టుబడులే’’ అని ఓ2 స్పా ఫౌండర్, ఎండీ ఎం.రితేష్ రెడ్డి, కో-ఫౌండర్, డెరైక్టర్ స్వప్న రెడ్డి బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలోని 17 నగరాల్లో 61 ఔట్‌లెట్ల ద్వారా ఏటా 4 లక్షల మందికి స్పా సేవలందిస్తున్నామన్నారు. ప్రస్తుతం హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లు, విల్లాలు, లగ్జరీ రైళ్లు ఐదు విభాగాల్లో తమ ఔట్‌లెట్లు విస్తరించి ఉన్నాయని.. ఈ ఏడాది ముగిసే నాటికి అదనంగా 150 సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇందులో 30 ఔట్‌లెట్లు ద్వితీయ శ్రేణి, 60 ఔట్‌లెట్లు తృతీయ శ్రేణి పట్టణాల్లో మరో 10 విదేశాల్లో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. తొలిసారిగా విజయవాడలో, కువైట్, బహ్రెయిన్, మధ్యప్రాచ్య దేశాల్లోనూ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

‘‘2008లో సంస్థను ప్రారంభించిన నాటి నుంచి ఏటా 45 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. గతేడాది రూ.78 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది ముగిసే నాటికి రూ.120 కోట్లకు చేరుకుంటాం. మా మొత్తం వ్యాపారంలో హోటల్స్ వాటా 46 శాతం, మాల్స్ 16 శాతం, విమానాశ్రయాలు 25 శాతం, రైళ్లు 3 శాతం, విల్లాలు 10 శాతం ఉంది. ప్రస్తుతం మా సంస్థలో 800 మంది స్పా నిపుణులున్నారు. ఇందులో 700 మంది ఓ2 స్కిల్ అకాడమీలో శిక్షణ పొందినవారే. విస్తరణ అవసరాల నిమిత్తం మరో 2 వేల మంది ఉద్యోగుల్ని నియమిస్తాం’’ అని రితేష్ వివరించారు.

 రూ.13,400 కోట్ల స్పా పరిశ్రమ..
అంతర్జాతీయంగా వెల్‌నెస్ పరిశ్రమ 3.4 ట్రిలియన్ డాలర్లుగా ఉందని వెల్‌నెస్ ఇనిస్టిట్యూట్.కామ్, పీడబ్ల్యూసీ నివేదిక చెబుతోంది. ఇందులో బ్యూటీ, స్లిమ్, థెరపీ, స్పా వంటివి వస్తాయి. అయితే దేశీ సంరక్షణ పరిశ్రమ 15 బిలియన్ డాలర్లుగా ఉంటే స్పా పరిశ్రమ రూ.13,400 కోట్లని (200 మిలియన్ డాలర్లు) లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిశ్రమ ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది. మొత్తం పరిశ్రమలో 80 శాతం వాటా అసంఘటిత రంగానిదే. స్పా పరిశ్రమలో డే స్పా, రిసార్ట్ స్పా, మెడి స్పా, డెస్టినేషన్ స్పా అని నాలుగు రకాలు. సుశిక్షుతులైన నిపుణుల కొరత స్పా పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా చెప్పవచ్చు.

>
మరిన్ని వార్తలు