గవర్నెన్స్‌ లోపాలే రాణా ఉద్వాసనకు కారణం 

1 Dec, 2018 05:34 IST|Sakshi

అశోక్‌ చావ్లాకు రాసిన  లేఖలో ఆర్‌బీఐ వివరణ

ముంబై: యస్‌ బ్యాంక్‌ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించే ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ నిరాకరించడానికి గవర్నెన్స్‌ లోపాలు, నిబంధనలను పాటించడంలో వైఫల్యాలే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 17న అప్పటి చైర్మన్‌ అశోక్‌ చావ్లాకు రాసిన లేఖలో ఆర్‌బీఐ ఈ విషయాలు పేర్కొన్నట్లు వివరించాయి. రుణాల నిర్వహణ విధానాలకు సంబంధించి బ్యాంక్‌లో పెద్ద యెత్తున అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆ లేఖలో పేర్కొంది. అలాగే, రాణా కపూర్‌ జీతభత్యాలు భారీగా పెంచే ప్రతిపాదనపై కూడా ఆర్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఈవోల బోనస్‌లను తగ్గించాలంటూ బ్యాంక్‌ల బోర్డులకు గతంలో ఇచ్చిన సూచనలకు ఇది విరుద్ధంగా ఉందని తెలిపింది. ప్రస్తుత ఎండీ, సీఈవో సారథ్యంలో యస్‌ బ్యాంక్‌ పాలన, నిర్వహణ, పర్యవేక్షణ విషయాలపై తమకున్న అనుమానాలకు ఈ పరిణామాలు ఊతమిచ్చేవిగా ఉన్నాయని లేఖలో ఆర్‌బీఐ పేర్కొంది.

ఇవే కాక గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా యస్‌ బ్యాంక్‌ పలు మార్గదర్శకాలను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించిందని పేర్కొంటూ.. సీఈవోగా కపూర్‌ కొనసాగింపును తిరస్కరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈవోను నియమించాలని ఆదేశించింది. చావ్లా ఈ మధ్యే బోర్డు నుంచి తప్పుకోగా.. ఆర్‌బీఐ లేఖలోని అంశాలపై స్పందించేందుకు యస్‌ బ్యాంక్‌ నిరాకరించింది. బ్యాంకు, ఆర్‌బీఐకి మధ్య జరిగే ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ గోప్యనీయమైనవని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ లేవనెత్తిన పలు అంశాలను ఇప్పటికే పరిష్కరించినట్లు, ఇదే విషయం ఆర్‌బీఐకి కూడా తెలియజేసినట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 1 7న ఆర్‌బీఐ లేఖ పంపించడానికి ముందే చాలా అంశాలు పరిష్కృతమైనట్లు వివరించాయి.  రాణా కపూర్‌ పదవీకాలాన్ని ఆర్‌బీఐ కుదించినప్పట్నుంచి యస్‌ బ్యాంక్‌లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్మన్‌ అశోక్‌ చావ్లాతో పాటు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేరు గణనీయంగా పతనమవుతోంది. ఏకంగా 40 శాతం క్షీణించి ప్రస్తుతం 33 నెలల కనిష్ట స్థాయుల్లో ట్రేడవుతోంది.    

మరిన్ని వార్తలు