ఓసీటీఎల్ ప్లాంటులో ఉత్పత్తి బంద్

23 Feb, 2016 01:33 IST|Sakshi
ఓసీటీఎల్ ప్లాంటులో ఉత్పత్తి బంద్

ఏజీఎంపై కార్మికుల దాడే కారణమన్న యాజమాన్యం
అధికారి మృతి వల్లే ఈ నిర్ణయమంటూ ఎక్స్ఛేంజీలకు లేఖ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్)... నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఉన్న తన ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18న కార్మికుల దాడిలో కంపెనీ ఆపరేషన్స్ సీనియర్ ఏజీఎం మస్తాన్ రావు గాయపడ్డారు. ఆ తరవాత ఆసుపత్రిలో చికిత్స చెందుతూ మృతి చెందారు. సోమవారం అత్యవసరంగా సమావేశమైన ఓసీటీఎల్ బోర్డు... దాడి తరువాత ప్లాంటులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించింది. ‘‘ఇతర సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్లాంటు కార్యకలాపాలను తక్షణమే నిలిపేయాలని నిర్ణయించాం.’’ అంటూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక లేఖ రాసింది. నార్కట్‌పల్లి ప్లాంటులో చమురు, సహజవాయు రంగాలకు అవసరమైన డ్రిల్లింగ్ పైపులను ఉత్పత్తి చేస్తున్నారు.

ఇక రిస్క్ తీసుకోలేం..ఎక్స్ఛేంజీలకు ఓసీటీఎల్ రాసిన లేఖ సారాంశం చూస్తే... ‘‘కార్మికుల దాడిలో కీలక అధికారిని కోల్పోయాం. మేనేజర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు భద్రంగా ఉండటం మాకు ముఖ్యం. దాన్ని పణంగా పెట్టలేం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా అభ్యర్థనేంటంటే సిబ్బందికి, కంపెనీ ఆస్తులకు తగిన భద్రత కల్పించమని. అంతేకాక ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించండి ’’ అని లేఖలో కోరింది. ఓసీటీఎల్ తన లేఖలో కొందరు కార్మికుల తీరుపై విరుచుకుపడింది. ‘‘గతంలో ఎలాంటి నోటీసులు, కారణాలు లేకుండానే కార్మికులు పనులను అడ్డుకునేవారు. బయటి వ్యక్తుల ప్రోద్బలంతో ఉత్పత్తిని అడ్డుకుని పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీసేవారు. మేనేజర్లను, ఇంజనీర్లను, ఉద్యోగులను బెదిరించేవారు. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుటే దాడికి పాల్పడ్డ సంఘటనలూ ఉన్నాయి’’ అని వివరించింది.

 మంత్రులకు సమాచారమిచ్చినా...
ప్లాంటులోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రికి, పరిశ్రమల మంత్రికి తెలియజేసినట్లు కంపెనీ పేర్కొంది. ‘‘మా ఆస్తులు, ఉద్యోగుల ప్రాణ రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రతిసారీ మంత్రులను కోరాం. మంత్రులు సమయం తీసుకోవటంతో పాటు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిని మేం తొలగిస్తే... వారిక్కూడా భారీ పరిహారం చెల్లించమన్నారు. దీంతో ఇష్టం లేకున్నా 2015 సెప్టెంబర్లో కొందరు కార్మికులను విధుల్లోకి తీసుకున్నాం. వారు మారలేదు సరికదా... సిబ్బందిని బెదిరించేవారు. చివరకు ఫిబ్రవరి 18న మస్తాన్‌రావుపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారు. గాయపడిన మస్తాన్‌రావు 20న మరణించారు. అందుకే ప్లాంటును నిలిపేస్తున్నాం’’ అని ఓసీటీఎల్ వివరించింది.

మరిన్ని వార్తలు