ఆఫ్‌లైన్ విపణిలోకి మోటరోలా..

10 Jun, 2015 00:32 IST|Sakshi
ఆఫ్‌లైన్ విపణిలోకి మోటరోలా..

తక్కువ లాభం తీసుకునే వ్యాపారులతో జోడి
మోటరోలా మొబిలిటీ జీఎం అమిత్ బోని

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కే పరిమితమైన మోటరోలా ఫోన్లు రిటైల్ దుకాణాల్లో కూడా దర్శనమీయనున్నాయి. భారత్‌లో 2014 మార్చి నుంచి డిసెంబర్ మధ్య కంపెనీ 30 లక్షల ఫోన్లను విక్రయించింది. 2015లో కూడా అంచనాలను మించి అమ్మకాలు నమోదు చేస్తోంది. ఇదే ఊపుతో ఇప్పుడు కొత్త విక్రయ వేదికలనూ వెతుకుతోంది. ప్రస్తుతం ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో తన ఉత్పత్తులను అమ్ముతోంది.

తక్కువ లాభం తీసుకుని ఫోన్లను విక్రయించే రిటైల్ వ్యాపారులతో భాగస్వామ్యానికి సిద్ధమని మోటరోలా ఇండియా మొబిలిటీ జీఎం అమిత్ బోని సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారమిక్కడ తెలిపారు. ‘కస్టమర్లకు ఆధునిక ఫోన్లు అందుబాటు ధరలో లభించాలన్నది మా ల క్ష్యం. ఆన్‌లైన్‌తో పోలిస్తే రిటైల్‌లో ఒక ఫోన్ ధర రూ.3 వేల దాకా అధికంగా ఉంటోంది. అందుకే ఆన్‌లైన్‌కు పరిమితమయ్యాం’ అని తెలిపారు. ఒక మోడల్‌కు దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండాలన్నది తమ ధ్యేయమని చెప్పారు.

ఇంటి వద్దకే సర్వీసు..
మోటరోలా కేర్ ఆన్ వీల్స్ పేరుతో ఢిల్లీలో ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించింది. ఫోన్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే కంపెనీకి ఫోన్ చేస్తే చాలు. కస్టమర్ వద్దకే వచ్చి రిపేర్ చేస్తారు. హైదరాబాద్‌తోసహా 10 నగరాల్లో కేర్ ఆన్ వీల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కంపెనీ దేశవ్యాప్తంగా 160 సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో 4 హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే గతేడాది విక్రయించిన 30 లక్షల యూనిట్లలో మోటో-ఇ, మోటో-జి మోడళ్ల వాటా 80 శాతం ఉంది. మోటో-ఇ మోడల్‌ను ప్రపంచంలో తొలిసారిగా భారత్‌లో ఆవిష్కరించారు. కంపెనీకి అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో భారత్ కూడా ఉండడంతో రాబోయే రోజుల్లో మరిన్ని మోడళ్లు తొలిసారిగా ఇక్కడ అడుగు పెట్టే అవకాశం ఉంది.

చెన్నై ప్లాంటు పునరుద్ధరణ..
కంపెనీ 2013లో చెన్నై ప్లాంటును మూసివేసింది. దేశీయంగా మొబైల్స్ తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ప్లాంటు పునరుద్ధరణ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మోటరోలాను కొనుగోలు చేసిన లెనోవో ఇందుకు సంసిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడు పునరుద్ధరణ చేస్తారో తానిప్పుడే చెప్పలేనని అమిత్ తెలిపారు. ఉత్పత్తుల ధర పెరగకుండా ఉండేందుకు ఏ విధానం ఉత్తమంగా ఉంటోందో దానిని అనుసరిస్తామని చెప్పారు. కాగా, ఎయిర్‌టెల్‌తో కలసి కొద్ది రోజుల్లో ప్రత్యేక ఆఫర్‌ను కంపెనీ ప్రకటించనుంది.

మరిన్ని వార్తలు