కాగ్నిజెంట్‌కు కలిసొచ్చిన జూన్‌ క్వార్టర్‌

4 Aug, 2017 01:35 IST|Sakshi
కాగ్నిజెంట్‌కు కలిసొచ్చిన జూన్‌ క్వార్టర్‌

470 మిలియన్‌ డాలర్ల లాభం... 86 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ జూన్‌ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. లాభం ఏకంగా 86 శాతం పెరిగి 470 మిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.252 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఆదాయం 9 శాతం వృద్ధితో 3.67 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి 8–10 శాతంగా ఉంటుందని లోగడ అంచనా వేయగా, తాజాగా 9–10 శాతానికి సవరించింది. ప్రస్తుత క్వార్టర్‌లో ఆదాయాలు 3.73–3.78 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని తెలిపింది. డిజిటైజేషన్‌ ద్వారా క్లయింట్లకు విలువను సమకూర్చడం వల్లే చక్కని ఫలితాలను నమోదు చేయగలిగినట్టు కంపెనీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజ తెలిపారు. ప్రధాన వ్యాపారంపై తమ పెట్టుబడులు కొనసాగుతాయన్నారు.

4,400 మంది అవుట్‌: ఐటీ రంగంలో ఉద్యోగులపై వేటు ఆందోళనలకు నిదర్శనంగా జూన్‌ త్రైమాసికంలో కాగ్నిజంట్‌ 4,400 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. పనితీరు బాగాలేని వారు, స్వచ్చందంగా విరమించుకున్నవారు వీరిలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,56,800కు చేరింది. అట్రిషన్‌ రేటు 23.6 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు