మార్చి నాటికి 50% నగదు రహిత విక్రయాలే

27 Dec, 2016 01:01 IST|Sakshi
మార్చి నాటికి 50% నగదు రహిత విక్రయాలే

భారత్‌ పెట్రోలియం వెల్లడి

ముంబై: ప్రభుత్వరంగంలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వచ్చే మార్చి నాటికి తమ మొత్తం విక్రయాల్లో 50 శాతం నగదు రహితంగానే జరపాలని భావిస్తున్నాయి. నవంబర్‌ 8 తర్వాత తమ అవుట్‌లెట్లలో డిజిటల్‌ లావాదేవీలు అంతకుముందున్న 10 శాతం నుంచి 26 శాతానికి పెరిగినట్టు బీపీసీఎల్‌ వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ/పీఎన్‌జీ, ఎల్‌పీజీ విక్రయాలకు సంబంధించి ఏటా 7.3 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్టు పేర్కొంది.

మార్చి చివరి నాటికి అన్ని ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమ లావాదేవీల్లో 50 శాతానికి పైగా లాయల్టీ కార్డులు, డెబిట్, క్రెడిట్‌ కార్డులు, ఈ వ్యాలెట్లు, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు బీపీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జార్జ్‌పాల్‌ సోమవారం ఢిల్లీలో తెలిపారు. నగదు రహిత లావాదేవీలను పెంచే లక్ష్యంలో భాగంగా తమ అవుట్‌లెట్లలో పీఓఎస్‌ మెషిన్ల ఏర్పాటుకు బీపీసీఎల్‌... ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర బ్యాంకులతో సోమవారం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే పేటీఎం, ఫ్రీచార్జ్, ఆక్సిజెన్, రిలయన్స్‌జియో, ఎస్‌బీఐ బుడ్డీ, ఫినో తదితర మొబైల్‌ వ్యాలెట్లతోనూ భాగస్వామ్యం ఉన్నట్టు బీపీసీఎల్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు