పాత గ్యాస్‌కి పాత రేటే!

11 Jul, 2013 03:21 IST|Sakshi
Reliance gas

 న్యూఢిల్లీ: గ్యాస్ ధర పెంపు విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి కేంద్ర ఆర్థిక శాఖ ఝలక్‌నిచ్చింది. రిలయన్స్ బకాయిపడిన (సాంకేతిక సమస్యలతో సరఫరా చేయడంలో విఫలం అయినందున) గ్యాస్‌కు పాత రేటే వర్తించేలా చూడాలని ప్రతిపాదించింది. ఆర్థిక శాఖలో భాగమైన వ్యయాల విభాగం.. గ్యాస్ ధరల పెంపుపై పరిమితి విధించడం, రిలయన్స్ గ్యాస్ రేటు అంశాలను ప్రస్తావిస్తూ ఈ మేరకు చమురు శాఖకు అధికారిక లేఖ పంపింది. ఈ అంశాలపై మీడియాలో వచ్చిన రెండు వార్తలను కూడా జత చేసింది. ప్రస్తుతం గ్యాస్ రేటు యూనిట్‌కి 4.2 డాలర్లుగా ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని 8.4 డాలర్లకు పెంచే దిశగా జూన్ 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. సీసీఈఏ ఫార్ములా ప్రకారం..  దిగుమతి చేసుకునే ద్రవీకృత గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ), అంతర్జాతీయ హబ్ రేట్ల ఆధారంగా దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను నిర్ణయిస్తారు. మొత్తం మీద ఇది అమల్లోకి వ స్తే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) లబ్ధి పొందనుంది.
 
 పూర్వాపరాలివీ..
 ఆర్‌ఐఎల్‌కి చెందిన కేజీ డీ6 బ్లాక్‌లో ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకి 80 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) స్థాయిలో ఉండాలి. అయితే, 2010 మార్చ్‌లో గరిష్టంగా 69.43 ఎంసీఎండీ ఉత్పత్తయిన గ్యాస్ ఇప్పుడు 14 ఎంసీఎండీకి పడిపోయింది. సాంకేతిక అంశాలే ఇందుకు కారణమని రిలయన్స్ చెబుతోంది. దీంతో గత 2-3 ఏళ్లుగా రిలయన్స్ తాను ముందు చెప్పిన స్థాయిలో గ్యాస్‌ని సరఫరా చేయడం లేదు.
 అయితే, కొత్త నిక్షేపాలు కనుగొన్నామని, త్వరలో గ్యాస్ ఉత్పత్తి కూడా పెరగగలదని ఆర్‌ఐఎల్ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. రేట్ల పెంపుపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఆర్‌ఐఎల్ ఈ ప్రకటనలు చేయడం విశేషం. పెపైచ్చు కొత్త రేట్లు ముందుగా ప్రభుత్వరంగ సంస్థలకే వర్తిస్తాయన్న కేంద్రం ఆ తర్వాత మాత్రం.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఆర్‌ఐఎల్‌కి నిర్దేశించిన 4.2 డాలర్ల ధర ముగిసేది కూడా అప్పుడే కావడం గమనార్హం. దీంతో ఇదంతా కూడా ఆర్‌ఐఎల్‌కి ప్రయోజనం చేకూర్చేందుకే జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
 
 ఈ నేపథ్యంలోనే.. ‘బకాయిపడిన’ గ్యాస్‌నే కంపెనీ పాత రేటుకి అమ్మేలా చూడాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమించి.. ఆర్‌ఐఎల్ మళ్లీ గ్యాస్ ఉత్పత్తిని పెంచాక, తక్షణమే కంపెనీకి కొత్త రేటు ప్రయోజనం వర్తించకుండా చూడాలని పేర్కొంది.  గతంలో సరఫరా చేయాల్సి ఉన్న గ్యాస్‌ను పాత రేటుకే సరఫరా చేసేలా చూడాలని, అది పూర్తయ్యాకే కొత్త రేటు వర్తించేలా చేయాలని సూచించింది.
 
 గ్యాస్ ధరకు పరిమితి ఉండాలి..: వచ్చే ఏడాది నుంచి రేట్లను పెంచినా కూడా గరిష్ట పరిమితి అంటూ ఉండేలా తగు నిర్ణయం తీసుకోవాలని కూడా చమురు శాఖకు రాసిన లేఖలో ఆర్థిక శాఖ పేర్కొంది. సీసీఈఏ ఆమోదించిన ఫార్ములా ప్రకారం.. ప్రతి త్రైమాసికానికి గ్యాస్ రేట్లను సవరిస్తారు. దీన్ని బట్టి చూస్తే .. సమీప భవిష్యత్‌లో గ్యాస్ ధర 10-12 డాలర్లకు పెరిగిపోయే అవకాశముంది. అందుకే, గరిష్ట రేటుపై పరిమితి విధించే  అవకాశాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ సూచించింది.
 
 గ్యాస్ భారంపై విద్యుత్ శాఖ కసరత్తు ..
 గ్యాస్ రేటు పెరిగితే .. విద్యుదుత్పత్తి సంస్థలపై పడే భారాన్ని ఎలా ఎదుర్కొనాలన్న దానిపై విద్యుత్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఈ దిశగా తీసుకోతగిన చర్యలు సూచించాలని రాష్ట్రాల ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలతో జరిగిన సమావేశంలో కోరినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు