సహజవాయువు ధర 6-6.5 డాలర్లు!

4 Aug, 2014 05:00 IST|Sakshi
సహజవాయువు ధర 6-6.5 డాలర్లు!

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరను 6-6.5 డాలర్లకు మాత్రమే పెంచాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు మాత్రం ప్రస్తుతానికి గ్యాస్ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్లకే కట్టడి చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా గ్యాస్ సరఫరాల్లో కొరతను(1.9 లక్షల ఘనపుటడుగులు-టీసీఎఫ్) పూడ్చుకునేవరకూ ఆర్‌ఐఎల్‌కు రేటు పెంపును వర్తింపజేయరాదనేది చమురు శాఖ ప్రతిపాదనగా వెల్లడించారు.

 ఒక్కో యూనిట్ గ్యాస్ రేటును ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి రెట్టింపు స్థాయిలో 8.4-8.8 డాలర్లకు పెంచాలన్న రంగారాజన్ కమిటీ ఫార్ములాను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 1 నుంచి కొత్త రేటును అమలు చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. మోడీ ప్రభుత్వం కొలువుదీరాక పెంపును అమలు చేయొచ్చని భావించగా.. ఇంత భారీగా గ్యాస్ రేటును పెంచితే విద్యుత్, ఎరువులు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కారణంతో సెప్టెంబర్ చివరి వరకూ వాయిదా వేశారు. రంగరాజన్ కమిటీ ఫార్ములాలో మార్పుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

తాజాగా చమురు శాఖ అంతర్గతంగా జరిపిన చర్చల్లో రేటు పెంపును 6-6.5 శాతానికే పరిమితం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. దీనివల్ల అటు చమురు కంపెనీలకూ ఇటు వినియోగదారులకూ ఊరట కల్పించవచ్చనేది పెట్రోలియం శాఖ యోచన. 1.9 టీసీఎఫ్‌ల గ్యాస్ కొరతను పూడ్చేవరకూ ఆర్‌ఐఎల్ పాతరేటునే(డీ1, డీ3 బ్లాకులకు) వర్తింపజేసి, తర్వాత జరిపే ఉత్పత్తి(దాదాపు 2.5 టీసీఎఫ్)కి కొత్త రేటును అమలు చేయాలని చమురు శాఖ భావిస్తోం ది. ఆర్‌ఐఎల్ కేజీ-డీ6 బ్లాక్‌లోని మిగతా క్షేత్రాలు, ఇతరచోట్ల ఉన్న బ్లాక్‌లలో జరిపే ఉత్పత్తికి మాత్రం ఇతర కంపెనీలకు మాదిరిగానే కొత్తరేటును వర్తింపజేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

 ఓఎన్‌జీసీ అన్వేషణలకు తిరస్కరణ..
 కేజీ బేసిన్‌లోని డీ5 బ్లాక్‌లో ఓఎన్‌జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ అన్వేషణలకు గాను మూడింటిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) తిరస్కరించింది. ఇవి వాణిజ్యపరంగా లాభదాయకమైనవిగా గుర్తింపు(డీఓసీ) ఇచ్చేందుకు నిరాకరించింది. డీజీహెచ్ నిర్దేశించిన ప్రకారం వీటిలో ధ్రువీకరణ పరీక్షలను నిర్వహించకపోవడమే ఆమోదం తెలపకపోవడానికి కారణమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు