డీజిల్ నష్టాలకు ఇక చెల్లు

9 Sep, 2014 00:15 IST|Sakshi
డీజిల్ నష్టాలకు ఇక చెల్లు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంవత్సరాల తరబడి పలు పెట్రో ఉత్పత్తులను నష్టాలకు విక్రయిస్తున్న దేశీ పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు, సబ్సిడీ భారాన్ని మోస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమేపీ దిగిరావడం, మరోవైపు రూపాయి మారకపు విలువ పుంజుకోవడంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు ఈ సోమవారంతో ఇక డీజిల్ నష్టాలు నష్టాలకు బ్రేక్‌పడినట్లే. గతేడాది లీటరు డీజిల్ అమ్మకం ద్వారా రూ. 14 వరకూ ఈ కంపెనీలకు నష్టాలు పెరిగిపోయాయి.

ఈ ఏడాది ప్రారంభంలో రూ. 8వరకూ తగ్గిన నష్టం తాజాగా పెట్రోలియం శాఖ గణాంకాల ప్రకారం గత శుక్రవారానికి (5 సెప్టెంబర్) 8 పైసలకు పడిపోయింది. ఆ రోజున ఇండియన్ బాస్కెట్ క్రూడ్ బ్యారల్ విలువ 99.66 డాలర్లకు తగ్గడం, డాలరుతో రూపాయి మారకపు విలువ 60.44కు పెరగడంతో రూపాయిల్లో ఈ బాస్కెట్ క్రూడ్ 6023.45కు తగ్గింది. ఈ సోమవారం ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర మరో 1 శాతంపైగా తగ్గడం, రూపాయి విలువ ఇంకో 15పైసలు పెరగడ ంతో ఇండియన్ బాస్కెట్ క్రూడ్ రూ. 5,950 స్థాయికి దిగివస్తుంది.

 తద్వారా డీజిల్ అమ్మకాలపై కంపెనీలకు నష్టం బదులు దశాబ్దం తర్వాత తొలిసారి లాభం వస్తుంది. అంతర్జాతీయంగా లభించే మూడు రకాల క్రూడ్స్  మనం దిగుమతి చేసుకుంటున్నందున, ఈ మూడింటినీ కలిపి ఇండియన్ క్రూడ్ బాస్కెట్‌గా వ్యవహరిస్తారు. ఈ మూడింటి 15 రోజుల సగటు విలువ ఆధారంగా పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభనష్టాలను గణిస్తారు.

 లాభం వినియోగదారులకు అందాలంటే మరికొంత సమయం....
 డీజిల్ నష్టాలు పూడేందుకు ప్రపంచ ధరలు తగ్గడం, రూపాయి పెరగడం మాత్రమే కారణం కాాదు. 2013 జనవరి నుంచి 19 దఫాలు లీటరుకు 50 పైసల చొప్పున మొత్తం రూ. 11.81 మేర పెంచడం ప్రధాన కారణం. ఇప్పటివరకూ పెంపు భరించిన వినియోగదారులు క్రూడ్ ధరల తగ్గుదల లబ్దిని పొందాలంటే మరికొంత సమయం పట్టొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే పెట్రోల్ ధరలు మార్కెట్‌తో అనుసంధానించి వున్నందున ప్రపంచ మార్కెట్లో ధర పెరిగితే ఇక్కడ పెంచడం, పడితే దేశీయంగా ధరను దించడం చేస్తున్నారు. అయితే డీజిల్ ధరల్ని ఇంకా మార్కెట్‌తో అనుసంధానించాల్సివుంది. డీజిల్ ధరలపై నియంత్రణలు ఎత్తివేసేందుకు కేబినెట్ నోట్‌ను పెట్రోలియం మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్నది. ఇక నుంచి కూడా ఇండియన్ బాస్కెట్ క్రూడ్ 100 డాలర్లకులోపు కొనసాగుతూ, రూపాయి విలువ మరింత పెరుగుతూ వుంటే కొద్ది వారాల్లో వినియోగదారులు డీజిల్ ధర తగ్గింపు శుభవార్త వినవచ్చు.

మరిన్ని వార్తలు